అన్నదాతకు మొండిచేయి

15 Jul, 2013 16:54 IST|Sakshi
అన్నదాతకు మొండిచేయి

అన్నదాతను ప్రభుత్వం మరోసారి దగా చేసింది. పొరుగు జిల్లా పశ్చిమ గోదావరిలో రైతులకు నీలం తుపాను పరిహారం అందజేసిన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం అదిగో... ఇదిగో అంటూ పరిహారం అందజేతను వాయిదా వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పరిహారం పంపిణీలో జరుగుతున్న జాప్యం అధికార పార్టీకి తల నొప్పిగా మారనుంది.

అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో నీలం తుపాను వల్ల గత ఖరీఫ్‌లో రైతులు పెట్టుబడులు కూడా నష్టపోయారు. ఎకరాకు రూ.15 వేల వరకు నష్టం వాటిల్లింది. దుర్భర పరిస్థితిలో ఉన్న రైతాంగం తమను ఆదుకోవాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు మొర పెట్టుకుంది. తక్షణం స్పందించి రైతన్నను ఆదుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలు హామీలు గుప్పించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ)ని హెక్టారుకు రూ.ఆరు వేల నుంచి రూ. పది వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తమది రైతు ప్రభుత్వమని ఘనంగా చెప్పుకున్నారు. ఇక జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులైతే తమ పట్టు వల్లే ప్రభుత్వం ఈ పెంపుదలకు అంగీకరించిందని గొప్పలు చెప్పుకున్నారు. తీరా పరిహారం పంపిణీ చేయాల్సి వచ్చేసరికి రోజుకొక కారణం చెప్పి ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు మొహం చాటేస్తున్నారు. జిల్లాలో నీలం తుపాను వల్ల నష్టపోయిన సుమారు 3.74 లక్షల మందికి రూ.164 కోట్ల పరిహారం అందాలి. పరిహారం పంపిణీకి జీవో సైతం జారీ అయింది. రైతులు బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో అకౌంట్లు ప్రారంభించనందువల్లే పరిహారం పంపిణీ ఆలస్యమైందని నిన్నమొన్నటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. అయితే పరిహారానికి అర్హులైన రైతులు 80 శాతానికి పైబడి అకౌంట్లు ప్రారంభించినా పరిహారం విడుదల కాలేదు.

ఇదే సమయానికి పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 85 శాతం మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ పంపిణీ అందడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2.52 లక్షల మంది రైతులకు రూ.123 కోట్ల పరిహారం మంజూరైంది. ఇందులో అకౌంట్లు పొందని సుమారు 20 వేల మంది రైతులకు తప్ప మిగతా వారందరికీ పరిహారం అందింది. కానీ మన జిల్లాలో రైతులకు మాత్రం ఆర్థిక శాఖ కొర్రీ పెట్టిందనే సాకుతో ఇంతవరకూ పంపిణీనే ప్రారంభించలేదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పరిహారం పంపిణీ ఆగిపోతుందని రైతులు ఆందోళన చెందారు. అయితే నోటిఫికేషన్‌తో పరిహారం పంపిణీకి సంబంధంలేదని వ్యవసాయశాఖ జేడీ ప్రమీల చెప్పడంతో వారు ఊరట చెందారు. తాజాగా ఆర్థిక శాఖ కొర్రీ పేరుతో పరిహారం పంపిణీ ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెట్టుబడులకు కటకట
గత ఖరీఫ్ సాగు నీలం తుపానుకు తుడిచిపెట్టుకుపోగా... ఆ తర్వాత రబీలో రైతులు పెద్దగా లాభాలు పొందలేకపోయారు. ఇప్పుడు ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు కూడా లేక నానా పాట్లు పడుతున్నారు. జిల్లాలో సాగు ఆలస్యానికి ఇదీ ఒక కారణమైంది. నీలం పరిహారం అందితే రైతులకు పెట్టుబడికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. అయితే జిల్లాలో రైతులు పరిహారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల్లో మాత్రం చలనం లేదు. నీలం పరిహారం కోసం ఇటీవల కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకులు అమలాపురంలో నిరవధిక నిరాహార దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వారం రోజుల్లో పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్‌లో వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణతో కూడా ఇదే మాట చెప్పించారు. అయితే గడువు పూర్తయినా రైతులకు పరిహారం అందలేదు. ఎందుకు మాట తప్పారని అమాత్యులను కోనసీమ రైతు పరిరక్షణ సమితి కూడా ప్రశ్నించకపోవడం విశేషం.

రైతును ఓటడిగేది ఎలా? : పంచాయతీ ఎన్నికల్లో రైతుల ఓట్లే కీలకం. నీలం పరిహారమే కాదు, జిల్లాలో రైతులకు రావాల్సిన సుమారు రూ.200 కోట్ల బీమా పరిహారం కూడా ఇంతవరకూ అందించలేదు. సవరించిన పంటల బీమా ప్రకారం పంట నష్టపోయిన రైతులకు 25 శాతం పరిహారం తక్షణం అందించాల్సి ఉన్నా ఇంతవరకూ ఇవ్వనేలేదు. అయితే సవరణ పేరు చెప్పి 4.50 శాతం ఉన్న బీమా ప్రీమియాన్ని మాత్రం 5.40 శాతానికి పెంచారు. ఇలా అన్నీ రైతు వ్యతిరేక విధానాలే అవలంబించడంతో అధికార పార్టీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తోంది.

మరిన్ని వార్తలు