శ్రీగిరికి ఉత్సవ శోభ

24 Mar, 2017 23:04 IST|Sakshi
శ్రీగిరికి ఉత్సవ శోభ
- రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది వేడుకలు ప్రారంభం
- భారీగా తరలి వచ్చిన కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు
- ఆలయ పూజా వేళల్లో మార్పు
 
శ్రీశైలం: ఉగాది మహోత్సవాలకు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ముస్తాబైంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. స్వామివార్ల ఆలయప్రాంగణంతోపాటు ప్రధాన వీధులు విద్యుత్‌ దీపాలంకరణతో వెలుగులీనుతున్నాయి.  ఆదివారం ఉదయం  8.30గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, శివసంకల్పం, స్వస్తి పుణ్యహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం భ్రమరాంబాదేవిని మహాలక్ష్మి రూపంలో అలంకరిస్తారు. స్వామి అమ్మవార్లను భృంగి వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు  రాత్రి 8 గంటల నుంచి శ్రీస్వామివార్లకు కల్యాణోత్సవం, శయనోత్సవపూజలను చేస్తారు.
 
ఆలయ పూజావేళల్లో మార్పులు
ఉగాది వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పూజా వేళలను మార్పు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త శుక్రవారం ప్రకటించారు. ఉత్సవాలు ఆరంభం అయ్యే నాటి నుంచి ఈ నెల 30న ముగిసే వరకు  ప్రతిరోజు వేకువజామున 3గంటలకు ఆలయద్వారాలు తెరచి సుప్రభాత, మహామంగళహారతి సేవలు.. అనంతరం 4గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వీర్వామంగా దర్శనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సాయంకాల పూజలు ముగిసిన తరువాత సాయంత్రం 5.30గంటల నుంచి అర్ధరాత్రి 2గంటల వరకు దర్శనాలు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  
 
ఆర్జితసేవల నిలుపుదల
ఉగాది మహోత్సవాల సందర్భంగా మల్లన్న గర్భాలయంలో జరిగే  ఆర్జిత అభిషేకాలు, అమ్మవారి అంతరాలయంలో జరిగే కుంకుమార్చన సేవ టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఈఓ తెలిపారు. అయితే భక్తుల సౌకర్యార్థం  వృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద రుద్రాభిషేకం, అమ్మవారి ఆశీర్వచన మండపంలో కుంకుమార్చన పూజలను నిర్వహించుకోవడానికి  అనుమతించినట్లు పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు