అథ్లెట్ల పోరాటం

19 Aug, 2016 21:23 IST|Sakshi
అథ్లెట్ల పోరాటం

ఎల్లెడలా ఆనందం
నవోదయలో ముగిసిన క్లస్టర్‌ లెవెల్‌ అథ్లెటిక్స్‌
అగ్రస్థానంలో మెదక్‌
ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్‌
రీజియన్‌ టోర్నీకి 16 మంది విద్యార్థులు ఎంపిక
వర్గల్‌:
ఒకరికి మరొకరు స్ఫూర్తి.. విజయమే అంతిమ లక్ష్యం..హోరాహోరీ పోరాటం..అరుపులు, కేరింతలు, హర్షాతిరేకాలు, చప్పట్లు.. రెండ్రోజుల పాటు వివిధ జిల్లాల అథ్లెట్ల విన్యాసాలతో వర్గల్‌ నవోదయ స్టేడియం మార్మోగింది. క్రీడాభిమానులకు అంతులేని ఆనందం పంచింది. విజయవంతంగా కొనసాగిన క్లస్టర్‌ స్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌ శుక్రవారం ముగిసింది.

ఆతిథ్య మెదక్‌ జిల్లాతోపాటు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నవోదయ విద్యార్థులు క్రీడాస్ఫూర్తి చాటుతూ ఆటలపోటీల్లో తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించారు. అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆతిథ్య మెదక్‌ జిల్లా వర్గల్‌ నవోదయ విద్యార్థులు 21 ఈవెంట్స్‌లో విజయాలు నమోదు చేసి, క్లస్టర్‌ మీట్‌లో అగ్రస్థానానికి ఎగబాకారు. 

13 ఈవెంట్స్‌లో గెలుపొందిన మహబూబ్‌నగర్‌ జిల్లా నవోదయ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. 11 అంశాల్లో వరంగల్‌ నవోదయ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా నవోదయ 8, నల్గొండ జిల్లా 8 చొప్పున, ఈస్ట్‌ గోదావరి 3, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నవోదయ విద్యార్థులు ఒకటేసి క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచారు.
క్లస్టర్‌ టోర్నీలో ‘వర్గల్‌’ హవా
క్లస్టర్‌ టోర్నీలో ఆతిధ్య వర్గల్‌ నవోదయ విద్యార్థులు చక్కని పోరాట పటిమ ప్రదర్శించారు. మొత్తం 15 మంది బాలికలు, 15 మంది బాలురు బరిలో దిగారు. ఇందులో తొమ్మిది మంది బాలికలు, ఏడుగురు బాలురు విజయాలు నమోదు చేసి టోర్నీ జరిగిన రెండు రోజుల్లోను తమ ఆధిక్యత చాటారు. లాంగ్‌జంప్, హర్డిల్స్, 100 మీటర్ల పరుగులో యూ. స్వర్ణలత  ప్రథమ స్థానంలో నిలిచింది. ఎల్‌ స్నేహ 1500 మీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులో విజేతగా నిలిచింది.

షాట్‌పుట్‌లో  కె. పవిత్ర, 1500 మీటర్ల పరుగులో ఎస్‌ శ్రావణి, 3 కిలోమీటర్ల పరుగులో డి. ప్రియాంక, జావెలిన్‌ త్రోలో జి శ్రావ్య, డిస్కస్‌ త్రో ఎండీ ముబీన్, హామర్‌త్రోలో కే రోషిణి, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎన్‌ పూజితలు విజేతలుగా నిలిచి రీజినల్‌ మీట్‌కు ఎంపికయ్యారు. అదేవిధంగా 400 మీటర్లు, 800 మీటర్ల పరుగులో యూ చంద్రశేఖర్,  1500 మీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులో పీ నవీన్‌రెడ్డిలు విజయాలు నమోదు చేసి రీజినల్‌ టోర్నీలో తమ పేరు ఖాయం చేసుకున్నారు.

5 కిలోమీటర్ల పరుగులో ఆర్‌ చైతన్య ప్రసాద్, 200 మీటర్ల పరుగులో జి రాజేష్, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆర్‌ విజయ్, 100 మీటర్ల పరుగులో డీ గణేష్, 5 కిలోమీటర్ల క్రాస్‌కంట్రిలో జీ రాజ్‌ కుమార్‌లు ప్రథమ స్థానంలో నిలిచారు. మొత్తం 21 ఈవెంట్లలో ఆతిథ్య నవోదయ విద్యార్థుల హవా కొనసాగింది.  


 

మరిన్ని వార్తలు