పుట్టపర్తిలో భారీ అగ్నిప్రమాదం

31 Aug, 2017 21:48 IST|Sakshi
పుట్టపర్తిలో భారీ అగ్నిప్రమాదం

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తిలోని గోపురం రెండో వీధిలో ఉన్న సాయి పల్లవి అపార్ట్‌ మెంట్‌లో నివాసముంటున్న మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ రామాంజినేయులు ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు రామాంజినేయులు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ఇంట్లోని అన్ని విలువైన వస్తువులూ కాలి బూడిదయ్యాయన్నారు. పనిమీద తాను విజయవాడకు వెళ్లడంతో భార్య మాధవీలత, కుమార్తెలు బిందు ప్రమద్వర, వేద మరుద్వతిలు ఇంట్లోనే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారన్నారు.

వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందికి తెలియజేయగా వారు మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనపై పోలీస్‌లకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి చెప్పారు. రామాంజినేయులు మున్సిపల్‌ కమిషనర్‌గానూ, పుడా వైస్‌ చైర్మెన్‌గాను సుమారు 6 సంవత్సరాలు పని చేశారు. గత సంవత్సరం ఏసీబీ దాడుల్లో సస్పెన్షన్‌కు గురైనా పిల్లల చదువుల నిమిత్తం పుట్టపర్తిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై రామాంజనేయులును సంప్రదించగా ఇది కుట్రపూరితంగా జరిగిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు