ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి

2 Jul, 2017 22:36 IST|Sakshi
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి
- మున్సిపల్‌ కమిషనర్‌తో ఎస్పీ సమీక్ష
కర్నూలు : నగరంలో పద్మవ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గోపినాథ్‌జట్టి ప్రత్యేక దృష్టి సారించారు. నగర పోలీసు అధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ హరినాథ్‌రెడ్డితో ఆదివారం సమావేశమై చర్చించారు. ట్రాఫిక్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్‌ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ స్థలాలు, అవసరమైన చోట ఫుట్‌పాత్‌లు, సిగ్నల్స్, నోపార్కింగ్‌ బోర్డుల ఏర్పాటుపై చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  పోలీసు, మున్సిపల్, రోడ్డు రవాణా, నేషనల్‌ హైవే, ఎన్‌జీఓలు సిటిజన్స్‌ సమన్వయంతో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.
 
నగరంలో లైటింగ్, చెత్తకుండీలు, ప్యాచ్‌వర్స్క్, బారికేడ్స్, వైట్‌మార్కింగ్, జీబ్రా క్రాసింగ్, సైన్‌బోర్డులు తదితర అంశాలు మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకునే విధంగా సమీక్షలో చర్చించారు. ట్రాఫిక్‌ సిబ్బందిని మరింత పెంచడంతోపాటు మొబైల్‌ పార్టీలు ఏర్పాటు చేసి నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించనున్నారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ షేక్షావలి, టౌన్‌ డీఎస్పీ డీవీరమణమూర్తి, సీఐలు సుబ్రమణ్యం, దివాకర్‌రెడ్డి, రోడ్డు రవాణా అధికారులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు