ఏటీఎం సెంటర్‌లో ఏ‘మార్చి’ టోకరా

21 Mar, 2017 01:43 IST|Sakshi
ఏటీఎం సెంటర్‌లో ఏ‘మార్చి’ టోకరా

తగరపువలస (భీమిలి) : పనిచేయని ఏటీఎం కార్డును బాధితుని చేతిలో పెట్టి అసలైన కార్డు ద్వారా రూ.65వేలు కాజేసిన సంఘటన సోమవారం తగరపువలసలో జరిగింది. మహరాజుపేటకు చెందిన మద్దిల అప్పలరాజు తగరపువలస ఎస్‌బీహెచ్‌ను ఆనుకుని ఉన్న ఏటీఎం సెంటర్‌లో కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడానికి వచ్చాడు. ఎంత సేపటికి ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో క్యూలో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. దీంతో బాధితుని వెనక ఉన్న అగంతకుడు ఆ కార్డును తీసుకుని దాని ద్వారా రూ.15వేలు విత్‌డ్రా చేసి అప్పలరాజుకు ఇచ్చాడు.

తరువాత మరో ప్రయత్నం చేయగా ఏటీఎం పనిచేయలేదని చెప్పి బాధితునికి కార్డు ఇవ్వగా.. ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఉండగా మరో రూ.65వేలు తన ఖాతా నుంచి విత్‌డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో తన వద్ద ఉన్న కార్డు చూసుకోవడంతో ఏటీఎం సెంటర్‌ వద్ద అగంతకుడు తన కార్డును మార్చి ఇచ్చినట్టు గ్రహించాడు. వెంటనే బాధితుడు భీమిలి పోలీసులు, బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగరంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అప్పలరాజు వెళ్లాడు.

మరిన్ని వార్తలు