గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ

15 Dec, 2015 13:41 IST|Sakshi
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ

కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్‌పై వేటు పడింది. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పేర్లు ఎవరివీ బయటకు రాకూడదంటూ గత రెండు రోజులుగా గౌతమ్ సవాంగ్‌పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలతో పాటు కీలక నేత నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన అంగీకరించలేదని తెలిసింది. దాంతో సెలవుల్లో వెళ్లాల్సిందిగా పై స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో పక్షం రోజుల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.

 

 కాల్ మనీ వ్యవహారం దర్యాప్తు నిర్వహించినప్పుడు అత్యంత భయానక విస్మయకర విషయాలెన్నో ఒక్కొక్కటికీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో బాధితులు కూడా ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ కీలక సమయంలో కాల్ మనీ గ్యాంగ్ పెద్దల తరఫున అధికార పార్టీ కీలక నేతలు జోక్యం చేసుకుని గౌతమ్‌సవాంగ్‌పై ఒత్తిళ్లు పెంచారు.

 

 విజయవాడలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎస్పీల సమీక్షా సమావేశం జరుగుతున్న సందర్భంగానే గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడమన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, అధికారులెవరూ తలొగ్గరాదంటూ చెప్పుకొచ్చారు.

 

 అలా మాట్లాడి 24 గంటలు కూడా తిరక్కముందే కాల్ మనీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కేసు దర్యాప్తు ప్రారంభించిన విజయవాడ కమిషనర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఎస్పీల కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంగానే పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గౌతమ్ సవాంగ్ 15 రోజుల సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. డీజీపీ రాముడు దాన్ని వెంటనే ఆమోదించడమే కాకుండా గౌతమ్ సవాంగ్ స్థానంలో ఏడీజీ ఆపరేషన్స్ విభాగం అధిపతి సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించినట్టు అధికారవర్గాలు చెప్పాయి.

మరిన్ని వార్తలు