ఉసురు తీసిన గేటు..

1 Jun, 2017 00:27 IST|Sakshi
  • చిన్నారి గాయత్రి మృతి
  • చెల్లాయికి తీవ్ర గాయాలు  
  • వీఆర్‌పురం (రంపచోడవరం) :
    చేసే పని అడవిలోనే కదా అని అనుకున్నారో ఏమోగాని  అటవీ శాఖ అధికారులు కనీస నిబంధనలను పాటించకుండా ఏర్పాటు చేసిన గేటు ఒక బాలిక మృతికి , మరో బాలిక శాశ్వతంగా అంగవైకల్యానికి కారణమైంది. మండలంలోని జీడిగుప్ప శివారు దారపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన విన్నెల సత్యనారాయణరెడ్డి, కనకమ్మల దంపతులకు ఐదుగురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో మూడో కుమారై గాయత్రీ (9), రెండో కుమారై సంగీత కొంతమంది పిల్లలతో పెదకొండ బంగ్లా సమీపంలో మామిడికాయలు కోసుకునేందుకు వెళ్లారు. ఇటీవల ఆ దారిలో అడవిలోని అక్రమ కలప రవాణా అరికట్టేందుకు వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఇనుప గేటును ఏర్పాటు చేశారు. ఆ గేటు అవతలి వైపు ఉన్న మామిడి చెట్ల వద్దకు వెళుతున్న పిల్లలు ఆ గేటును పట్టుకుని ఊగుతుంటే గేటు సిమెంటు దిమ్మెతో సహా విరిగి పడిపోయింది. దీంతో గాయత్రి, సంగీత ఆ గేటు దిమ్మ కింద ఇరుక్కుపోయారు. దీంతో మిగిలిన పిల్లలు భయపడి పరుగున గ్రామానికి చేరుకుని విషయాన్ని  పెద్దలకు తెలియజేశారు. వారొచ్చి చూసేసరికి గాయత్రి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సంగీత కుడి కాలు విరిగి అపస్మారక స్థితిలోకి ఉంది. సంగీతను ఆటోలో రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి భద్రాచలం తీసుకువెళ్లారు. గాయత్రి మూడో తరగతి చదువుతూ మధ్యలో నిలిపివేసింది. సంగీత దారపల్లి గ్రామంలోని పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఒక కూతురు మృతి చెందడం, మరో కూతురు కాలు పోగొట్టుకొని ఆస్పత్రి పాలవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.  ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  
     
     
>
మరిన్ని వార్తలు