‘గ్రానైట్‌’పై జీఎస్టీ పిడుగు

3 Jun, 2017 19:58 IST|Sakshi
‘గ్రానైట్‌’పై జీఎస్టీ పిడుగు

– జీఎస్టీతో 28 శాతం పన్ను విధింపు
– మూతపడే ప్రమాదంలో పరిశ్రమలు
– ఆందోళనకు సిద్ధమవుతున్న యజమానులు


హిందూపురం రూరల్‌ : గ్రానైట్‌ పరిశ్రమలపై వస్తు సేవా పన్ను (జీఎస్టీ) పిడుగు పడింది. ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేసే సరుకుపై 28 శాతం పన్ను విధించనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీతో భారీ స్థాయిలో పన్ను పడుతుండటంతో పలు గ్రానైట్‌ పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పరిశ్రమ యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ నుంచి గ్రానైట్‌ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులను గ్రానైట్‌ పరిశ్రమ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. చైనా ఉత్పత్తులతో దేశీయ గ్రానైట్‌ పరిశ్రమల ఉత్పత్తులు అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. వస్తు సేవా పన్నులో 28 శాతం గ్రానైట్‌ ఉత్పత్తులపై విధించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. పరిశ్రమలు నెలకొల్పడానికి బ్యాంకుల్లో తీసుకున్న రుణాల నెలవారి కంతులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు.

దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి ముడి సరుకు (రాయి)పై రూ.2,600 రాయల్టీని చెల్లిస్తున్నాం. గ్రానైట్‌ పరిశ్రమల్లో విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ పన్ను తోడైతే పరిశ్రమలు మూతపడే అవకాశం లేకపోలేదు. జిల్లాలోని తాడిపత్రిలో కటింగ్, పాలిషింగ్‌ పరిశ్రమలు సుమారు 450 ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో 14 పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కో పరిశ్రమలో 14 నుంచి 15 మంది ప్రత్యక్షంగా, 8 నుంచి 10 మంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గ్రానైట్‌ పరిశ్రమ నుంచి జీఎస్టీ నామమాత్రంగా వసూలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంది.

శ్లాబ్‌ పద్ధతిలో రాయితీలు ఇవ్వాలి
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రానైట్‌ పరిశ్రమలకు శ్లాబ్‌ పద్ధతిలో రాయల్టీ పన్నులు విధించి ఆదుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగిస్తే పరిశ్రమలు మనుగడ సాగిస్తాయి. లేనిపక్షంలో కార్మికులు వీధినపడే అవకాశం ఉంది. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపుపై బలంగా వాదనలు వినిపించి పన్ను శాతం 28 నుంచి 5 శాతానికి తగ్గించి పరిశ్రమలను ఆదుకోవాలి.
- మల్లేశ్వరరెడ్డి, గ్రానైట్‌ పరిశ్రమ యజమాని, తాడిపత్రి

మరిన్ని వార్తలు