లోక కల్యాణార్థం హనుమాన్‌ చాలీసా మహాయజ్ఞం

6 Nov, 2016 23:36 IST|Sakshi
లోక కల్యాణార్థం హనుమాన్‌ చాలీసా మహాయజ్ఞం

విజయవాడ (ఆటోనగర్‌): నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వరంలో జనవరి 21వ తేదీన హనుమాన్‌ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు పటమట దత్తపీఠం ఆశ్రమ ట్రస్ట్‌ తెలిపింది. దత్తపీఠం చీఫ్‌ కొల్లి గోపాలకృష్ణ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం రాజధాని కోసం, దేశ ప్రపంచశాంతి సౌభాగ్యాల కోసం దత్తపీఠ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశారని తెలిపారు. ఇప్పటికే గతేడాది తెనాలిలో సుమారు 3 లక్షల మందితో, అమెరికాలో 10వేల మందితో 24 గంటల పాటు చాలీసా మహాయజ్ఞాల్ని నిర్వహించారని అన్నారు.
అనంత ఫలప్రదాయిని: సచ్చిదానంద స్వామీజీ  
అనంతరం కార్యక్రమంలో అంతర్జాలంలో స్కైప్‌ ద్వారా మైసూరు దత్తపీఠం నుంచి అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ విలేకరులను, భక్తులనుద్దేశించి సందేశాన్నందించారు. సామూహిక ప్రార్థన అనంత ఫలమని, నూతన రాష్ట్ర ప్రజల సంక్షేమం, లోక కళ్యాణార్థం ఈ హనుమాన్‌ చాలీసా మహాయజ్ఞాన్ని సంకల్పించామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణానదీ తీరంలోని పద్మావతి ఘాట్‌లో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని హనుమాన్‌ ఆశీస్సులు పొందాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్ట్‌ పెందుర్తి రాధాకృష్ణ, సత్యనారాయణ, తుమ్మల శ్రీమన్నారాయణ, లీగల్‌ అడ్వైజర్‌  కెపి రమణ, నిర్మలా చౌదరి పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు