టీడీపీలో వేడి

14 Jun, 2016 08:50 IST|Sakshi
టీడీపీలో వేడి

రెండేళ్ల అనంతరం తొలిసారి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లిన మంత్రి సుజాత
జానంపేట అక్విడెక్ట్‌ను పరిశీలించిన దేవినేని ఉమ

 
ఏలూరు :  పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, ముంపు మండలాల్లో ప్రజల  ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసి అధికార పార్టీలో వేడి మొదలైంది. అయితే, అనివార్య కారణాల వల్ల వైఎస్ జగన్ పర్యటన రద్దయ్యింది. తన నియోజకవర్గంలోనే పొగాకు వేలం కేంద్రాలు ఉన్నా ఏనాడూ వాటివైపు కన్నెత్తి చూడని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సోమవారం ఆగమేఘాల మీద రెండు వేలం కేంద్రాలను సందర్శించడం చర్చనీయాంశమైంది.
 
గత ఏడాది పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందు లకు గురై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నా వారి సమస్యలపై మంత్రి స్పందించలేదు. తాజాగా జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సుజాత వేలం కేంద్రాలకు వెళ్లారు. వర్జీనియా పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వంద రోజుల్లో వేలం పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకూ చేయలేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారంటూ వారిపై జాలి చూపించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 
మరోవైపు జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న పోలవరం కుడికాలువ అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడానికే సమయాన్ని కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడం జగన్‌మోహనరెడ్డికి ఇష్టం లేదని, అందుకే ముంపు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముంపు మండలాల అభివృద్ధికి రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు.
 
ఆ ప్రాంతంలో కనీస అభివృద్ధి కూడా జరగకపోగా.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్లు ఇతరత్రా ఏ పథకాలు అందకపోవడంతో  వేలేరుపాడు, కుకునూరు మండలాల ప్రజలు అధికార టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి రెండు నెలల క్రితం పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై బురదచల్లే పనిలో రాష్ట్ర మంత్రులు నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు