సేవాస్ఫూర్తి

17 Aug, 2016 01:17 IST|Sakshi
: పుష్కరస్నానం తర్వాత వృద్ధులను నదిఒడ్డుకు తీసుకొస్తున్న వలంటీర్లు
  •  కృష్ణాపుష్కరాల్లో ఐదొందల మంది వలంటీర్ల ఉచితసేవలు
  •  కల్కీభగవాన్, రెడ్‌క్రాస్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌ఆర్‌ యువసేన సేవకులు
  •  ఎదుటివారు సాయం అడిగితే చాలు.. క్షణాల్లో ముందుంటారు!
  • రంగాపూర్‌ ఘాట్‌ నుంచి ‘సాక్షి’ బృందం: పుష్కర ఘాట్ల మెట్లు ఎక్కి దిగలేని వృద్ధులు పుణ్యస్నానాలు కోసం వారిని వెంట తీసుకొస్తారు.. దాహం వేసిందని అడిగితే చాలు క్షణాల్లో గ్లాసు నీళ్లను ఇట్టే తీసుకొచ్చి ఇస్తారు.. వాహనాలను ఎక్కవ పార్కింగ్‌ చేయాలో చెబుతారు.. ఆకలిగా ఉందని అడిగితే చాలు అన్నదాన ప్రాంగణం ఎక్కడుందో చూపిస్తారు.. 
      సుస్తీ చేసిందని చెబితే చాలు వైద్యచికిత్సలు అందజేసే వైద్యకేంద్రంలో ఎక్కడుందో దారిచూపిస్తారు. నీళ్లలో మునిగిపోకుండా జాగ్రత్తలు చెబుతారు. దైవదర్శనానికి ఎలా వెళ్లాలో సూచిస్తారు.. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లు భక్తి నిరతితో కృష్ణాపుష్కరాలకు వస్తున్న భక్తులకు విశేషసేవలు అందిస్తున్నారు. కేవలం రంగాపూర్‌ ఘాట్‌ వద్దే కేవలం 500మంది స్వచ్ఛంద సేవకులు తమ ఉచితసేవలు అందిస్తున్నారు. వారిలో కల్కీభగవాన్, రెడ్‌క్రాస్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌ఆర్‌ యువసేన సంస్థలకు చెందిన భక్తులు ఉన్నారు. వారి సేవలో వలంటీర్లు తరిస్తున్నారు. భక్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రకతి కాపాడడం, వైద్యసేవలకు తీసుకెళ్లడం, తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా పంపించేందుకు పుష్కర సేవకులు శ్రమిస్తున్నారు. 
       
    సేవే మా అభిమతం
    మేమంతా కల్కీభగవాన్‌ సేవామార్గంలో నడుస్తాం. పుష్కర భక్తులకు సేవలందించేందుకు పాలమూరు జిల్లాకు 500 మంది వలంటీర్లు వచ్చారు. రంగాపూర్‌ ఘాట్‌ వద్ద 150మంది సేవలు అందిస్తున్నారు. సేవలతో మాకు సంతృప్తి లభిస్తోంది. అన్ని రకాల సేవలందిస్తున్నాం. ముఖ్యంగా నదీనీరు కలుషితం కాకుండా పర్యవేక్షిస్తున్నాం.
     – బి.రమా, కల్కీభగవాన్‌ వలంటీర్, ఆదిలాబాద్‌
     
    భక్తుల సేవలో..
    దూరప్రాంతాల నుంచి పుష్కర స్నానాల కోసం వచ్చిన భక్తులకు సేవలందించేందుకు ఐదురోజులుగా ఇక్కడే ఉంటున్నాం. ఘాట్‌ ప్రత్యేకాధికారుల సూచన మేరకు భక్తులకు కావాల్సిన సేవలందిస్తున్నాం. పుష్కరాలు పూర్తయ్యేవరకు సేవలందిస్తాం. 
    – చెన్నయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్, మహబూబ్‌నగర్‌ 
     
     ఐదు నిమిషాల్లో ముందుంటాం..
     సహాయం.. అని అడిగి ఐదు నిమిషాల్లో సేవలు అందించేందుకు ముందుకొస్తాం. రెడ్‌క్రాస్‌ సొసైటీ తరఫున పుష్కరాల ప్రారంభం నుంచి 150 మంది వలంటీర్లతో కలిసి భక్తులకు సేవలు అందిస్తున్నాం. ఉదయం 6 నుంచీ రాత్రి 9 గంటల వరకు పుష్కర సేవలోనే ఉన్నాం..
    – పోచ రవిందర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి, వనపర్తి
     
మరిన్ని వార్తలు