హై అలర్ట్‌

24 Jul, 2016 22:50 IST|Sakshi
గోదావరి ముల్లకట్ట బ్రిడ్జి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
  • మందుపాతర్లతో అప్రమత్తమైన పోలీసులు 
  • ముల్లకట్ట బ్రిడ్జి వద్ద నాఖాబందీ
  • అంతర్రాష్ట్ర వాహనాలు తనిఖీ 
  • ఫెర్రీ పాయింట్లు, అడవుల్లో బలగాల మోహరింపు 
  • ఏటూరునాగారం :ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకన్నగూడెం–రామచంద్రాపురం గ్రామాల మధ్య మావోయిస్టులు మందుపాతరలు అమర్చడంతో సరిహద్దులోని ఏటూరునాగారం ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ముల్లకట్ట బ్రిడ్జి వద్ద  సీఐ రఘుచందర్, ఎస్సై నరేష్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌పార్టీ, సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఆదివారం నాఖాబందీ నిర్వహించారు. 163 జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర వాహనాల తనిఖీ చేపట్టారు.
     
    లాడ్జీలు, బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లలో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ  సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శనివరాం అర్ధరాత్రి వెంకటాపురం మండలంలో మావోయిస్టులు రోడ్డుపై ప్లాస్టిక్‌ బకెట్లలో మందుపాతరలు అమర్చి లేఖలను వదిలేశారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఆమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని లేఖలో పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి వాటికి కరపత్రాలను అంటించారు. దీంతో అటు ఖమ్మం, ఇటు వరంగల్‌ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
     
    ఫెర్రీ పాయింట్ల వద్ద మోహరింపు
    ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు, గతంలో పడవలు, నావలపై రాకపోకలు సాగించిన ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీసులు నిఘా వేశారు. గోదావరి దాటేందుకు వచ్చే ప్రజల వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాక రెండు గ్రేహౌండ్స్‌ దళాలు ఏజెన్సీలోని అడవులను జల్లెడ పడుతున్నాయి. 
     
    మూడు ఠాణాలకు భద్రత పెంపు
    ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట పోలీస్‌స్టేషన్లకు భద్రతను రెట్టింపు చేశారు. స్టేషన్‌కు వచ్చి పోయే ప్రజలు, ఇతరులపై సీసీ కెమెరాల పుటేజీలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మాజీ మావోయిస్టులను విచారిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు, గ్రామాల్లో నూతన వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
     
    పట్టణాలకు పరుగులు తీస్తున్న టార్గెట్లు..
    మావోయిస్టులు ఏజెన్సీలోని కొందరిని టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ వారోత్సవాలలోనే వారిపై చర్య తీసుకుంటామని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. పత్రికా ప్రకటనల ద్వారా టార్గెట్ల పేర్లు వెలువరిస్తున్నారు. దీంతో వారు అప్రమత్తమై మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. 
     
మరిన్ని వార్తలు