వేడెక్కుతున్న సాగునీటి ఉద్యమం

28 Aug, 2016 21:27 IST|Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌:   జిల్లాలో చారిత్రక సాగునీటి వనరైన కేసీ కెనాల్‌కు నీటి విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఆయకట్టు రైతుల పాలిట శాపంగా పరిణమించింది. సెప్టెంబరు వస్తున్నా ఇప్పటివరకు నీటి విడుదలపై ప్రభుత్వం నోరు మెదపలేదు. దీంతో ఏ పంటలు సాగు చేసుకోవాలో అర్థం కాకుండా రైతులు అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోరాటమే శరణ్యమనే అభిప్రాయానికి రైతులు వచ్చారు. కేసీ కెనాల్‌ కింద జిల్లాలో ఎనిమిది మండలాల్లో సుమారు 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత సంవత్సరం శ్రీశైలం జలాశయానికి తగినంత నీరు వచ్చినప్పటికీ, తాగునీటి నెపంతో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పోటీపడి నీటినంతా నాగార్జునసాగర్, కష్ణా డెల్టాకు తరలించుకుపోయాయి. దీంతో చుక్కనీరు విడుదల కాకుండా జిల్లా ఆయకట్టు రైతులు తమ పొలాలను బీళ్లుగా పెట్టుకోవాల్సి వచ్చింది. తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ యేడు రుతు పవనాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో సమద్ధిగా కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీ ప్రవాహమే వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో ఎన్నడూ లేని విధంగా 200 టీఎంసీలకు పైబడి నీరు చేరింది.

అయితే ప్రభుత్వం కనీస నీటిమట్టాన్ని నిర్వహించలేదు. శ్రీశైలంలోకి వస్తున్న ప్రవాహం వల్ల ఈ యేడైనా సాగునీరు విడుదల అవుతుందని రైతులు భావించారు. కొంత నీటిని అధికారులు విడుదల చేయడంతో ఆయకట్టులోని సుమారు 90 శాతం మంది రైతులు నారుమళ్లు వేసుకున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కొందరు నాట్లు కూడా వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం రైతులను కలవరపెడుతోంది. శనివారం హైదరాబాదులో జరిగిన కష్ణా యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో కష్ణా డెల్టా అవసరాల కోసం సెప్టెంబరు నెలకుగాను పది టీఎంసీలు అడిగి సాధించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదే చరిత్ర కలిగిన కేసీ కెనాల్‌ అవసరాల గురించి ప్రస్తావించలేదు. జీఓ నెంబర్‌ 3 ప్రకారం శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు పది టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఆ జీఓ ప్రకారమైనా కేసీకి పది టీఎంసీలు కేటాయించాలని త్రిసభ్య కమిటీని ప్రభుత్వం పట్టుపట్టాల్సింది. కేసీ ఆధునికీకరణ వల్ల ఆదా అయ్యే ఎనిమిది టీఎంసీలను గతంలో ఎస్‌ఆర్‌బీసీకి కేటాయించారు. అయితే ఎస్‌ఆర్‌బీసీ కింద పూర్తి స్థాయిలో నీటి వినియోగం లేదు. కనుక ఆ నీటినైనా కేసీకి ఇవ్వాలని ప్రభుత్వం అడగలేదు. డెల్టాపై ఉన్న శ్రద్ధ కేసీ కెనాల్‌పై లేకపోవడం దారుణమని రైతులు మండిపడుతున్నారు.

ప్రస్తుతం శ్రీశైలంలో 872 అడుగుల నీటిమట్టం ఉంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. కనుక శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తే రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటి విడుదలలో ఆలస్యమయ్యే కొద్ది పంటలు చీడపీడల బారిన పడి దిగుబడులు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని రైతులు అంటున్నారు. ఆగస్టు 20 నుంచి బ్రహ్మంసాగర్‌కు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని ఈనెల 9వ తేది కర్నూలులో జరిగిన ఐఏబీ సమావేశంలో నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు చుక్క నీరు జిల్లా సరిహద్దులకు చేరలేదు. ఈ యేడు గండికోటకు 12 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ఆగస్టు 15వ తేది స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. వారంలోపే గండికోట ముంపు వాసుల సమస్యలను కొలిక్కి తీసుకొచ్చి ఆ తర్వాత నీటి విడుదలకు చర్యలు చేపడతామని కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభం కాలేదు. దీంతో గండికోటకు నీటి విడుదల సందేహాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు