అనుమానంతోనే కడతేర్చాడు

5 Aug, 2016 06:31 IST|Sakshi
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌
నెల్లూరు (క్రైమ్‌) : మరొకరితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను ఐదో నగర పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన మార్తాల సుమలత (28)కు అదే ప్రాంతానికి చెందిన రవీంద్రబాబుతో వివాహమైంది. వివాహానంతరం వారు పడారుపల్లి చలపతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి పవన్, మదన్‌ కుమారులు. రవీంద్రబాబు పలురకాల వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2012లో ఆయన అనారోగ్యంతో మతి చెందాడు.

ఇది జరిగిన కొద్దిరోజులకే రవీంద్రబాబు సోదరుడు శ్రీకాంత్‌తో ఆమె వివాహమైంది. కొద్దిరోజులు వారి కాపురం సజావుగా సాగింది. శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. వ్యసనాలకు బానిసైన అతను సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయసాగాడు. అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో చలపతినగర్‌లోని ఇంటిని అమ్మేందుకు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భార్య ససేమిరా అంది. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో సుమలత తన ఇంటి పక్కనే ఉంటున్న ఆటో డ్రైవర్‌తో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై జూలై 25న దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్‌ ఆమెను తీవ్రంగా కొట్టడంతో మతి చెందింది. ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అప్పట్లో బాధిత కుటుంబ సభ్యుల ఐదోనగర ఇన్‌స్పెక్టర్‌ జి. మంగారావుకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌  గురువారం నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేశారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు