మొగుడే యముడు

29 Sep, 2016 23:32 IST|Sakshi
మొగుడే యముడు

– ఉపాధ్యాయిని జయశ్రీని హతమార్చింది భర్తే?
– పోలీసుల ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు సమాచారం
– అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకోలు
––––––––––––––––––––––––––––––––––––––
అనంతపురం సెంట్రల్‌ : దంపతులిద్దరూ ప్రభుత్వోద్యోగులే. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వత్తిలో కొనసాగుతున్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. చివరకు అంతమొందించాడు. తప్పించుకునేందుకు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మతి చెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేశానంటూ అంగీకరించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతపురం పాతూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న జయశ్రీ(35), యూటీఎఫ్‌ నగర కార్యదర్శిగా ఉంటున్న జనార్దన్‌ గంగానర్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, వారి కుటుంబం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది.


అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అతను బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో గొడవపడినట్లు తెలుస్తోంది. విచక్షణ కోల్పోయిన అతను భార్య తలను గోడకేసి కొట్టడంతో పాటు ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె మతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆ తరువాత కంగారుపడిన నిందితుడు భయంతో ఆమెను పలు ప్రైవేటు హాస్పిటళ్లకు పిల్చుకెళ్లినట్లు తెలిసింది. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు తెలిసి బాత్‌రూంలో జారి కింద పడినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో అసలైన సంగతి ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అతన్ని అధికారంగా అరెస్టు చూపే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు