అంత అమాయకుడినా: వెంకయ్య

17 Jun, 2016 02:44 IST|Sakshi
అంత అమాయకుడినా: వెంకయ్య

రాజ్యసభ సీటు కోసం బాబును అడుగుతానా?
సాక్షి, విజయవాడ/అమరావతి:  ‘1978లో రాష్ట్రంలో ఇందిరాగాంధీ అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో నెల్లూరు జిల్లాలో నేనొక్కడినే బీజేపీ నుంచి గెలుపొందాను. ఓ జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన నేను రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును అడుగుతానా? అంత అమాయకుడినా?’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చిన వెంకయ్యను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరించాలనే ఉద్దేశంతోనే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని 1985లోనే నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ‘ఒకప్పుడు వాజ్‌పేయి, అద్వానీలకు మైక్ పట్టుకున్న నేను బీజేపీ అధ్యక్షుడినయ్యాను. వారి మధ్యే కూర్చునే స్థాయికి ఎదిగాను. రాష్ట్రం నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ కేంద్ర మంత్రుల కోసం ఎవరైనా వస్తే నా వద్దకే మంత్రులను పిలిపించి పనులు చేసి పంపిస్తున్నాను. విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజ్యసభలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో అందరికీ తెలుసు.

దాని వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలిగిందో కూడా తెలుసు’ అని అన్నారు. తాను, చంద్రబాబు కష్టపడి పైకి వచ్చామన్నారు. దేశంలో రైతులకు ఆర్థిక పరపతి కల్పించేందుకు రూ.9 లక్షల కోట్ల రుణాలు ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చుతామని ప్రకటించారు. అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధిని కేంద్రీకృతం చేయొద్దని సూచించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలను కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత ఉన్న నేత వెంకయ్యనాయుడు అని కొనియాడారు.

మరిన్ని వార్తలు