భూ బకాసురులు

30 Aug, 2016 18:50 IST|Sakshi
భూ బకాసురులు
  • కళానగర్‌లోటీడీపీ నాయకుల దందా
  • ఆక్రమణలు తొలగించిన చోటే నిర్మాణాలు
  • హెచ్చరిక బోర్డులు మాయం
  •  
    మధురవాడ : భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతల అండతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జీవీఎంసీ 4,5 వార్డుల్లో కబ్జాలు నిత్యకృత్యమయ్యాయి.  వీరి దందా ముందు హెచ్చరిక బోర్డులు కూడా తలవంచుతున్నాయి. సాక్షాత్తూ కలెక్టర్‌ పేరిట ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి నిర్మాణాలు చేస్తున్నా రెవెన్యూ,జీవీఎంసీ అటు వైపు కన్నెత్తి చూడక పోవడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
     
    కలెక్టర్‌ పేరిట ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సైతం పీకి పడేసి ఆక్రమణలకు పాల్పడుతున్నా వారి వంక కన్నెత్తి చూసేవారు కూడా కరువయ్యారు. ఈ ఆక్రమణలకు ప్రధాన సూత్రధారులు అధికార పార్టీనాయకులు, వారి అనుచరులే కావడంతో వారి అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. దీనికి జీవీఎంసీ 5వ వార్డులోని కళానగర్‌లోని ఈడబ్ల్యూఎస్‌ లే అవుట్‌లో ఆక్రమణల పర్వమే నిదర్శనం.
    ఇదీ  పరిస్థితి
    సర్వే నంబరు 161/1లో ఉన్న 36.12ఎకరాలు ప్రభుత్వ భూమి,161/2లో మరికొంత అనాధీన ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన భూమిలో కొంత గెడ్డ ఉండగా,  1985 ప్రాంతంలో సుమారు 55 మంది కళాకారులకు  ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. తర్వాత మరి కొందరికి పట్టాలు ఇచ్చారు.  మిగిలిన విస్తీర్ణం ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఆక్రమణలు వెలిశాయి. పేదల పేరిట టీడీపీ నాయకులు ఇటు గెడ్డ స్థలంలో, ప్రభుత్వ స్థంలో కూడా డెబ్రిస్‌ వేసి కప్పేసి మరో వైపు నిర్మాణాలు చేస్తున్నారు.
    తొలగించిన చోటే నిర్మాణాలు
    ఇక్కడ గెడ్డ వైపు రెండు చోట్ల గతంలో ప్రస్తుతం ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఆర్‌ఐగా ఉన్న రవిశంకర్‌ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించి, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆక్రమణ తొలగించిన స్థంలోనే షెడ్‌ వెలసింది.  హెచ్చరిక బోర్డు పీకేసి మరో షెడ్‌ నిర్మించారు.
    ఇష్టానుసారంగా గెడ్డ స్థలం పూడ్చివేత
    ఇక కళానగర్‌– వాంబే కాలనీ మధ్య ఉన్న గెడ్డె–చెక్‌ డ్యాం స్థలం కప్పుకున్న వారికి కప్పు కున్నంత అన్నట్టు ఉంది. దీనిని ఆనుకుని ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారు, చోటా నాయకులు డెబ్రిస్‌ తెచ్చి ఇష్టాను సారంగా పూడ్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. 
    కోట్లు విలువ చేసే భూమిపై ఎందుకు నిర్లక్ష్యం? 
    ఈ కాలనీ జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో ఎకరం రూ.8కోట్ల వరకు పలుకుతోంది. ఇక్కడ ఒక్కో షెడ్‌  అనధికారికంగా రూ.5 నుంచి రూ.6లక్షల వరకుఅమ్ముడవుతుంది. దీంతో కబ్జారాయుళ్లు కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట షెడ్‌లు వేసి ఆక్రమణలకు పాల్పడున్నారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ భూమి కబ్జా, వ్యాపారం సాగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆక్రమణలు రెగ్యులరైజ్‌ చేయిస్తామని, రెవెన్యూ అధికారులకు సమర్పించుకోవాలని టీడీపీ నాయకులు ఒక్కోరి వద్ద నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 
    కబ్జాదారులకు కలిసొచ్చిన వేళ
    రెండు నెలలుగా బదిలీలు, ఓటర్ల ఎన్యూమరేషన్,  స్మార్టు పల్స్‌సర్వే కబ్జారాయుళ్లకు వరంగా మారాయి. ఇక్కడ ఉన్న ఐదుగురు వీఆర్వోలు స్మార్టు పల్స్‌ సర్వేలో ఎన్యూమరేటర్లుగా, వీఆర్‌ఏలను ట్యాబ్‌ అసిస్టెంట్‌లుగా ప్రభుత్వం నియమించింది.  దీంతో ఆక్రమణల పర్వం నిరభ్యంతరంగా సాగుతుండటంతో మరికొంత మంది ఆక్రమణలు సిద్ధమవుతున్నారు. 
    టీడీపీ నాయకుల కన్నెర్రతో మౌనం
    జీవీఎంసీ 4వ వార్డు సాయిరాంకాలనీలో కొన్ని ఆక్రమణలకు తొలగించేందుకు వీఆర్‌వోలు సిద్ధం కాగా ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు అడ్డుపడటంతో వారు తోక ముడిచారు. టీడీపీ నేతలు ఆగడాలకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని స్థానికులు అంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఆక్రమణ దారులకే కొమ్ము  కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
     
    పరిశీలించి చర్యలు
    నేను ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. ఈ విషయం ఇంత వరకు మా దృష్టికి రాలేదు. ఫీల్డ్‌లో పరిస్థితి అంతా పరిశీలించి చర్యలు చేపడతాం. అక్రమణ దారులపై కఠినంగా వ్యవహరిస్తాం.
    –ఎం.శంకరరావు, తహసీల్దార్‌
     
మరిన్ని వార్తలు