ప్రమాణాలపై తనిఖీలు!

21 Oct, 2015 02:30 IST|Sakshi
ప్రమాణాలపై తనిఖీలు!

డిగ్రీ కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీపై సర్కారు దృష్టి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై సర్కా రు దృష్టి సారించింది. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీల్లో విద్యా బోధన ఎలా ఉంది? కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నారా? లేదా? వారి అర్హతలు ఏంటి? ల్యాబ్, లైబ్రరీలు ఉన్నాయా? లేదా? ఎలాంటి సదుపాయాలు ఉన్నాయన్న సమగ్ర వివరాలను సేకరించే పని లో పడింది. ఈ నెలాఖరు లోగా రాష్ట్రంలోని 1,150 వరకు ఉన్న డిగ్రీ కాలేజీలు సమగ్ర సమాచారాన్ని ఉన్నత విద్యా మండలికి అందే లా వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం వచ్చే జనవరి/ఫిబ్రవరి నెలల్లో ఉండనున్న నేపథ్యంలో కాలేజీల వారీగా పరిస్థితులను తెలుసుకునే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం.

దీంతోపాటు నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కాలేజీల వారీ సమాచారం అంద గానే నవంబర్/డిసెంబర్ నెలల్లో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని భావిస్తోంది. గతంలో ఏర్పాటు చేసినవి 850వరకు ఉండగా, రాష్ట్ర విభజనకు ముందు 300 వరకు ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చేశారు. అవసరం లేని ప్రాంతాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు అప్పటి ఏపీ ఉన్నత విద్యా మండలి ఓకే చెప్పింది. నిబంధనలు పా టించారా? లేదా? అన్నది కూడా చూడకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.

కొత్త వాటిల్లోనే కాకుండా గతంలో ఏర్పాటు చేసిన 850 కాలేజీల్లోనూ అదే దుస్థితి నెలకొన్నట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాలపై గందరగోళం నెలకొనడంతో కాలేజీల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాలేజీల వ్యవహారాన్ని తేల్చాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి మొదటి నుంచి భావిస్తోంది. కాలేజీల భవనాలు, స్థలాల డాక్యుమెంట్ల విషయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ సహకారం తీసుకుని.. ఎన్ని కాలేజీలు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టాయి.. కాలేజీల్లో సౌకర్యాల వంటి అంశాలపై దృష్టి పెట్టి తనిఖీలు చేయాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు