మరణించేవరకు జైలు

8 Mar, 2017 00:17 IST|Sakshi
మరణించేవరకు జైలు
- రూ. 2.20 లక్షల జరిమానా
- అత్యాచార ఘటనలో నిందితుడికి శిక్ష
 
కర్నూలు(లీగల్‌ ): అత్యాచార  ఘటనలో నిందితుడు పఠాన్‌ ఖాజాఖాన్‌కు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. శిక్షతో పాటు రూ.2.20 లక్షల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి తీర్పు ఇచ్చారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిత్తారి వీధికి చెందిన బాలిక..  2013 నవంబర్‌ నెలలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా  ఖడక్‌పురకు చెందిన ఆటోడ్రైవర్‌ పఠాన్‌ ఖాజా ఖాన్‌ ఆటోలో ఎక్కించుకున్నాడు.
 
తన ఇంటి వైపు తీసుకెళ్తుండగా బాలిక ప్రశ్నించింది. తన ఇంట్లో బ్యాగు తీసుకుని వెళ్దామని నమ్మ బలికి ఇంట్లోకి తీసుకెళ్లాడు. తన ఇల్లు చూడమంటూ బలవంతంగా ఇంటి పైఅంతస్తులోకి తీసుకెళ్లి గదిలో బంధించి అత్యాచారం చేశాడు. వారం వరకు గదిలో ఉంచి ప్రతిరోజూ బాలికపై అత్యాచారం జరిపాడు. వారం రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి విషయం ఎవరికైనా చెబితే నిన్ను, నీ అమ్మను చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్ల తర్వాత బాలికకు మగబిడ్డ పుట్టాడు. సంవత్సరం తర్వాత అతను చేసిన ఘాతుకాన్ని కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడైన ఖాజా ఖాన్‌ను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
పకడ్బందీగా విచారణ..
ఎస్పీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి విచారణ అధికారిగా కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితునిపై అన్ని సెక్షన్ల కింద నేరం రుజువు కావడంతో మొదటి అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సంచలన తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేంద్రప్రసాద్‌ వాదించారు. నిందితుడు చెల్లించాల్సిన జరిమానాను బాధితురాలికి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.
 
2014 సంవత్సరంలో ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కర్ణాటకకు చెందిన నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన మట్టి రవి, కురువ శ్రీనులపై నమోదైన కేసులో కూడా  డీఎస్పీ రమణమూర్తి పకడ్బందీగా విచారణ జరిపి ఆలస్యం జరగకుండా శిక్ష పడే విధంగా కృషి చేశారు. ఆ కేసు తీర్పు స్ఫూర్తితో కర్నూలు వన్‌టౌన్‌ పరిధిలో 2013 సంవత్సరంలో ఇద్దరు మైనర్‌ బాలికలపై జరిగిన అత్యాచారం కేసులను కూడా విచారించి నిందితులకు శిక్షలు పడేలా రమణమూర్తి కృషి చేశారు. మూడు కేసుల్లోనూ నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేసినందుకు రమణమూర్తిని ఎస్పీ ఆకే రవికృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు కూడా అభినందించారు. 
 
మహిళా దినోత్సవానికి మహిళలకు ఈ తీర్పు కానుక.. 
మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి రెండవసారి కఠిన కారాగారశిక్షను న్యాయస్థానం విధించడం పట్ల ఎస్పీ  ఆకే రవికృష్ణ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేంద్రప్రసాద్, విచారణ అధికారి రమణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి ఈ తీర్పు కనువిప్పు కలగాలని వారు అభిప్రాయపడ్డారు. గత ఏడాది సెప్టెంబర్‌ 26న వెలువడిన తీర్పులో నిందితుడు ఖాజా ఖాన్‌కు జీవిత కాలపు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించారని ఈ సందర్భంగా దర్యాప్తు అధికారి గుర్తు చేశారు. వన్‌టౌన్‌ పరిధిలో గతంలో ఏడు సంవత్సరాల బాలికపై నిందితుడు అత్యాచారం చేసిన కేసులో జీవిత కాలపు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
మరిన్ని వార్తలు