హోరాహోరీగా కబడ్డీ సమరం

18 Jan, 2017 00:25 IST|Sakshi
హోరాహోరీగా కబడ్డీ సమరం
నరసాపురం రూరల్‌ : నరసాపురం రుస్తుంబాదలో జాతీయస్థాయి మహిళల, పురుషుల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలు చివరి దశకు చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. మరోవైపు పోటీలను లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో నిర్వహిస్తుండడంతో గెలుపు కోసం క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో మ్యాచ్‌లు నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్నాయి. అటు పురుషులు, ఇటు మహిళల విభాగంలో ఆంధ్రా జట్టు ఆడుతున్న సమయంలో క్రీడాభిమానుల నుంచి వారికి చప్పట్లతో ప్రోత్సాహం లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంకు, పూణే, పోస్టల్‌ కర్ణాటక, ఆంధ్రా, ఆర్కే స్పోర్ట్స్, కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ జట్లు ప్రతిభకనబర్చి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. పాయింట్ల ఆధారంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సెమీఫైనల్స్‌ జరిగాయి. బుధవారం ఉదయం కూడా సెమీ ఫైనల్స్‌ పోటీలు జరగనున్నాయి. అనంతరం రాత్రి ఫైనల్స్‌ జరుగుతాయి. పోటీలను ఆంధ్రా రిఫరీస్‌ బోర్డు చైర్మన్, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి, ట్రెజరర్‌లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రాత్రి ఫైనల్స్‌ అనంతరం బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తామని పోటీల కన్వీనర్‌ కొత్తపల్లి జానకిరామ్‌ తెలిపారు.  
విజేత జట్లు ఇవే..
అటు పురుషులు, ఇటు మహిళల విభాగంలో మంగళవారం మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగాయి. పురుషుల విభాగంలో పాలం జట్టుపై పోస్టల్‌ జట్టు 8 పాయింట్ల తేడాతోనూ, బహారిదాస్‌ జట్టు ఠానే జట్టుపై 12 పాయింట్లు, ఆర్‌కే స్పోర్ట్స్‌ బీ జట్టు పై కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ జట్టు 29 పాయింట్ల తేడాతోనూ గెలుపొందాయి. మహిళల విభాగంలో ఎండీఎస్‌ హర్యాణా జట్టు ఆంధ్రా బీ జట్టుపై 7 పాయింట్ల తేడాతోనూ, బాబా హరిదాస్‌ జట్టుపై 10 పాయింట్ల తేడాతో ఆంధ్రా ఏ జట్టు , పూణే జట్టుపై ఎస్సీ రైల్వే జట్టు 43 పాయింట్ల తేడాతోను విజయం సాధించాయి.
 
 
 
 
మరిన్ని వార్తలు