కబాలి క్రేజ్‌

21 Jul, 2016 23:18 IST|Sakshi
కబాలి క్రేజ్‌
 
  •  జిల్లాలో 32  థియేటర్లలో సినిమా విడుదల
  • వెయ్యి రూపాయలు పలుకుతున్న ఒక్క టికెట్టు
నెల్లూరు (సిటీ) :
కబాలి ఫీవర్‌ నెల్లూరు జిల్లాను కూడా ఊపేస్తోంది. శుక్రవారం జిల్లాలోని 32 థియేటర్‌లో ఈ చిత్రం విడుదలవుతోంది. అభిమానుల క్రేజ్‌ను థియేటర్ల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. నెల్లూరు నగరంలోని రెండు థియేటర్లలో మాత్రమే కబాలి సినిమా ప్రదర్శితమవుతుంది. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ సదుపాయం పెట్టకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. థియేటర్‌ యాజమాన్యం బ్లాక్‌ విక్రయాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహిస్తున్నారు. ఒక్కో టికెట్‌ రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతోందని తెలుస్తోంది. 
అన్ని శాఖల అధికారులకు టిక్కెట్లు
నెల్లూరు నగర పాలక సంస్ధ, ఆర్డీఓ, కలెక్టరేట్, పోలీస్, ఫైర్‌స్టేషన్‌ తదితర శాఖలకు ఒక్కో షోకు పది నుంచి 50 టిక్కెట్ల వరకు థియేటర్‌ యాజమాన్యం అందచేస్తున్నట్లు సమాచారం. దీంతో సామాన్య ప్రజలకు టిక్కెట్లు అందడమే కష్టతరమవుతుంది. అధికారులు, రాజకీయనాయకుల అండదండలుంటేనే టికెట్లు అందే పరిస్థితి ప్రస్తుతం నెల్లూరులో చోటుచేసుకుంది. దీంతో సామాన్యుడు సినిమాను మొదటి రోజు చూడటం కలగా మారింది. ముఖ్యంగా పోలీస్‌శాఖవారు దాదాపు 100 టిక్కెట్లు వరకు తీసుకెళ్లారని సమాచారం. ఈ విధంగా అధికారులకు టికెట్లు ఇస్తుంటే తాము సామాన్యులకు టికెట్లు ఏ విధంగా అందచేయగలమని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం లేదని, సీటింగ్‌ కెపాసిటీ మేరకు అందరికీ టిక్కెట్లు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంటున్నారు.
మరిన్ని వార్తలు