పేదింట కల్యాణలక్ష్మి

26 Apr, 2016 01:35 IST|Sakshi
పేదింట కల్యాణలక్ష్మి

ఆడపిల్లల కుటుంబాలను ఆదుకుంటున్న పథకం
పెళ్లినాటి ఖర్చులో సగానికి తగ్గుతున్న భారం
జిల్లాలో ఇప్పటివరకు 2,760 మందికి మంజూరు
ఎదురుచూస్తున్న 1,179 మంది దరఖాస్తుదారులు
వచ్చేనెల 1వ తేదీ నుంచి బీసీ, ఈబీసీలకూ వర్తింపు

 ఈరోజుల్లో ఆడపిల్ల పెళ్లి ఆషామాషీ కాదు. సంబంధం కుదిరిన దగ్గరి నుంచి డబ్బులు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సిన రోజులు. కలిగిన కుటుంబాలకైతే ఏ ఇబ్బందీ ఉండదు. మధ్యతరగతి కుటుంబమైతే కాస్త చూసి ఖర్చు చేసుకుంటుంది. మరి నిరుపేద కుటుంబమైతే అప్పు చేయడం తప్పనిసరి. పెళ్లి చేసిన నాలుగైదు ఏళ్ల వరకు తల్లిదండ్రులు వడ్డీలకు తెచ్చిన డబ్బులకు మిత్తీలు కట్టుకుంటూ పోవాల్సిందే. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పేదల ఇంట్లో పెళ్లికి కానుకగా అందిస్తున్న పథకం ‘కల్యాణలక్ష్మి’. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జిల్లాలో ఇప్పటివరకు 3,439 మంది దరఖాస్తు చేసుకోగా 2,760 మందికి డబ్బులు మంజూరయ్యాయి.      - చేవెళ్ల

పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. 2014 మహాత్మాగాంధీ జయంతి రోజున కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అందులో భాగంగా వారి కుటుంబాలకు రూ. 51 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా ఈ పథకాన్ని దళిత, గిరిజనులకు మాత్రమే వర్తింపజేసింది. ఈ పథకం కింద వివాహం చేసే అమ్మాయి వయస్సు 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, మొదటి వివాహం అయి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

అంతేగాక ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అమ్మాయి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించరాదని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే ఈ మొత్తంతో సగం పెళ్లి ఖర్చుల నుంచి బయట పడ వచ్చని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా షాదీముబారక్  పేరుతో ముస్లిం మైనారిటీలకు కూడా ఈ పథకం ప్రభుత్వం వర్తింపజేసింది. 2015 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లోని పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 3,439 మంది దరఖాస్తు చేసుకోగా 2,760 మందికి మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

వచ్చేనెల 1వతేదీ నుంచి  బీసీ, ఈబీసీలకు వర్తింపు
సమాజంలోని పలు వర్గాల డిమాండ్ మేరకు కల్యాణలక్ష్మి పథకాన్ని వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీసీలకు) సైతం వర్తింపజేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ పథకం ద్వారా బీసీలు, ఈబీసీలు కూడా లబ్ధిపొందనున్నారు.

ఎదురుచూపులు
రంగారెడ్డి జిల్లాలో ఈ పథకం కింద 3,439 మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో కేవలం 2,760 మందికి మాత్రమే మంజూరు చేశారు. దీంతో కల్యాణలక్ష్మిలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 1,179 మంది ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి మం జూరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంబంధిత అధికారులు పరిశీలనలో జాప్యం చేస్తుండడంతో దరఖాస్తుదారులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెల కొంది. 

 పెళ్లి ఖర్చులకు పనికి వచ్చాయి
మాది సామాన్య పేద కుటుంబం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం గురించి తెలుసుకుని పెళ్లి ముందే దరఖాస్తు చేసుకున్నాం. దీంతో వివాహ సమయానికి ముందే రూ. 51 వేలు అధికారులు అందించారు. ఈ డబ్బు ఎంతో ఉపయోగపడింది.
- అండాలు, చేవెళ్ల గ్రామం

తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేద తల్లిదండ్రులను ఆదుకుంటోంది. వివాహ సమయంలో బంధుమిత్రులు, తెలిసిన వారు కూడా అప్పు ఇచ్చేందుకు వెనకాడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ. 51 వేలతో సగం వివాహం పూర్తి అయినట్లే. ఇంతకన్నా ఏం కావాలి.   - అరుణ, చేవెళ్ల

పెళ్లికి చేసిన.. అప్పులు తీరాయి
మాది నిరుపేద కుంటుంబం. నేను చిన్నగా ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ కూలీనాలీ చేసి పెంచింది. నా పెళ్లికి రూ.లక్ష వరకు అప్పు చేసింది. అందులో క ల్యా ణ లక్ష్మి కింద రూ. 51 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. వాటితో సగం అప్పులు తీర్చుకున్నాం. 
- సునంద, నారెగూడ, నవాబ్‌పేట మండలం

మరిన్ని వార్తలు