తమ్ముళ్లకూ కబ్జాకాటు

5 Apr, 2016 00:34 IST|Sakshi
తమ్ముళ్లకూ కబ్జాకాటు

జిల్లాలో పెరుగుతున్న  టీడీపీ నేతల భూ దందా
సొంత పార్టీ కార్యకర్తల  భూములనూ వదలని నాయకులు
ఇచ్చినంత తీసుకుని  వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం
ఎదురుతిరిగితే అక్రమ కేసులు.. బెదిరింపులు  
సత్తెనపల్లి, గుంటూరు   శివారు ప్రాంతాల్లో ఘటనలు
అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నపోలీసు అధికారులు
 

జిల్లాలో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు చేస్తున్న భూ దందాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల భూములను కూడా విడిచిపెట్టడం లేదు. విలువైన స్థలం కనిపిస్తేచాలు.. నయానోభయానో యజమానులను వెళ్లగొట్టి స్వాధీనం చేసుకుంటున్నారు. ఎదురుతిరిగిన వారిపై మందీమార్బలంతో కలసి దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. కబ్జా బాధితుల్లో స్వయానా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉంటున్నారు.

 
సాక్షి, గుంటూరు
: జిల్లాలో రాజధాని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నేతల దందాలు పెచ్చుమీరిపోయాయి. గతంలో భూములు అమ్ముకుని వెళ్లిపోయిన వారితో సంతకాలు చేయించుకుని, వాటిని అడ్డుపెట్టుకుని  భూమి తమదంటూ దబాయిస్తున్నారు. నిజమైన భూయజమానులు వచ్చి ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకుని వెళ్లమంటూ బెదిరింపులకు దిగుతున్నారు.  పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు.  జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు నగర శివారు ప్రాంతాల్లో భూములపై టీడీపీ భూ రాబందుల కన్ను పడింది.  కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించుకుంటున్నారు.
 అధికారులంతా వారి చెప్పుచేతల్లోనే..


వివాదాస్పద భూములకు సంబంధించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి బంధువులు చెప్పినట్టుగా ఆడుతున్న అధికారులు నిజమైన భూ యజమానులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. స్థల యజమానులు తమ వద్ద ఉన్న  డాక్యుమెంట్లు అన్నీ చూపించినప్పటికీ వారి గోడు వినిపించుకునే వారే లేరు. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవుగా రెవెన్యూ అధికారులు అడంగళ్లులో పేర్లు మార్చేయడం, వారి పేరుతో ఉన్న పాస్‌పుస్తకాలను రద్దు చేయడం వంటివి చేస్తూ భూ బకాసురులకు తమవంతు సహకారం అందిస్తున్నారు.

ఆపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన అడంగళ్లను అడ్డుపెట్టుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, భూమిని స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు రౌడీలు, తమ అనుయాయులను వివాదాస్పద స్థలంలో దింపి అడ్డువచ్చినవారిపై దాడులకు పాల్పడుతున్నారు.
పోలీసులు సైతం అధికార పార్టీ నేతలకు తొత్తులుగా బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

 సత్తెనపల్లి, గుంటూరులలో టీడీపీ నేతల అరాచకం
గుంటూరు శివారు ప్రాంతం కాటూరి మెడికల్ కళాశాల పక్కన సుమారు 7.50 ఎకరాల భూమిని ఓ మంత్రి అండ దండలతో గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నేత కబ్జా చేశారు. గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ చౌదరి ఈస్థలం తనదంటూ డాక్యుమెంట్లను అధికారులు, పోలీసులకు చూపినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు సీఎం, గవర్నర్‌తోపాటు ఏసీబీ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన సదరు టీడీపీ నేత తన అనుచరులను భూముల్లోకి పంపి అడ్డుపడిన రామకృష్ణచౌదరిపై బెదిరింపులకు దిగారు.


ఇక సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల వద్ద టీడీపీ కార్యకర్త సుబ్బారావు చౌదరికి చెందిన సుమారు 17.3 ఎకరాల భూమిపై ముఖ్యనేత తనయుని కన్ను పడింది. వెంటనే తన నమ్మినబంటులాంటి ఓ వ్యక్తిపేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇది అక్రమమని సుబ్బారావు చౌదరి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే భూమిని తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు శనివారం రాత్రి నరసరావుపేట నుంచి మందీమార్బలంతో భూమి వద్దకు వచ్చారు. సుబ్బారావుకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని రాస్తారోకో చేశారు. అప్పటికి వెళ్లిపోయిన ఆ నేత అనుచరులు  తిరిగి సోమవారం మధ్యాహ్నం 200 మంది రౌడీలతో వచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు