ఫేస్‌బుక్‌ కీచకుడు

5 Jun, 2016 11:42 IST|Sakshi
ఫేస్‌బుక్‌ కీచకుడు

పెనుగొండ: అతనో అధ్యాపకుడు. భావ వ్యక్తీకరణ, నిర్వహణ కోర్సులో దిట్ట. సామాజిక మాధ్యమాల నిర్వహణలోనూ ఆరితేరాడు. యువతులను వేధించడానికి అతను సామాజిక మాధ్యమాన్నే వేదికగా చేసుకున్నాడు. అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ చివరకు కటకటాలపాలయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కారాని నరేష్‌ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఇతను నకిలీ ధ్రువపత్రాలతో సిమ్‌ తీసుకుని, ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించాడు. అందులో యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతూ పరిచయం చేసుకోవడం మొదలెట్టాడు. కొంత చనువు పెరిగాక అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ఇలా చాలామందికి అసభ్య మెసేజ్‌లు పంపాడు. ఈ నేపథ్యంలోనే పెనుగొండకు చెందిన ఓ యువతికి కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ సి.హెచ్‌.రామారావు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం నరేష్‌ను అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

అప్రమత్తంగా ఉండాలి : పోలీసులు
అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేసేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ ఎస్సై సి.హెచ్‌.వెంకటేశ్వరరావు హెచ్చ రించారు. ఇటీవల ఫేస్‌బుక్, వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని, మరికొందరు ఫిర్యాదు చేయడం లేదని వివరించారు. యువత ఇటువంటి వారి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు