భయం భయంగా... పఠనం

16 Aug, 2016 23:07 IST|Sakshi
  • శిథిలావస్థలో గ్రంథాలయం
  • కలగా నూతన భవన నిర్మాణం  
  • ఇబ్బందుల్లో పాఠకులు
  • సిర్పూర్‌(టి) :  పెచ్చులూడుతున్న గ్రంథాలయ భవనం పాఠకులకు ప్రాణ సంకటంగా మారింది. విజ్ఞానాన్ని పంచాల్సిన గ్రంథాలయం భయాన్ని పరిచయం చేస్తోంది. గాంధీజీ ‘‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో’’   అని పుస్తకాల ప్రాముఖ్యతను తెలిపారు. కానీ ఆ మహాత్ముడు నడియాడిన నేల మీద పాలకులు, అధికారులు గ్రంథాలయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతిపితను అవమానపరుస్తున్నారు. పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతున్న గ్రామీణ గ్రంథాలయాలను పట్టించుకొనే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే శిథిలావస్థకు చేరిన సిర్పూర్‌ గ్రంథాలయంపై కథనం...
              మండల కేంద్రంలోని గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు పాఠకులు. దీంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది. 1990లో నిర్మించిన భవనంలోనే నేటికీ శాఖా గ్రంథాలయం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రంథాలయ భవనానికి మరమ్మతులకు నిధులు మంజూరు కాకపోవడంతో గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రంథాలయ సామగ్రి తడుస్తోంది. గ్రంథాలయ భవనం పూర్తిగ శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు గ్రంథాలయాన్ని మార్చాలని  పలుసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదు అధికారులు.
    నిర్లక్ష్యం దారి తీస్తోంది నిరాదరణకు...
    గ్రంథాలయంలో 13,000 పాఠ్య పుస్తకాలు ఉండగా కొన్ని పుస్తకాలు చెదలుపట్టిపోయాయి. అదే విధంగా 25 కుర్చీలు, బల్లలు ఉండగా వాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో 15 కుర్చీలు వినియోగించ లేనంతగా మారాయి. దీంతో ఉన్న సామగ్రితోనే గ్రంథాలయాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రంథాలయానికి ప్రతి రోజూ వందల సంఖ్యలో వచ్చే పాఠకులు గ్రంథాలయ భవనం ఎప్పుడు కూలి పోతుందోన నే భయంతో పాఠకులు గ్రంథాలయానికి రావడానికి భయపడుతున్నారు. దీంతో గ్రంథాలయం ఉన్నా నిరుపయోగంగా మారుతోంది. వర్షాకాలంలో భవనం పైకప్పు పెచ్చులూడుతుండడంతో భవనంలోకి రావడానికి పాఠకులు జంకుతున్నారు.
    అసౌకర్యాల నెలవు...
    గ్రంథాలయంలో సౌకర్యాలు లేకపోవడంతో పాఠకులుSఇబ్బందులకు గురవుతున్నారు. సరిపడ కుర్చీలు లేకపోవడంతో పాఠకులు ఆరుబయటే నిలబడి పుస్తకాలు చదువుతున్నారు. రెండు సంవత్సరాలుగా గ్రంథాలయానికి నూతన పుస్తకాలు రావడం లేదు. గతంలో పలుసార్లు గ్రంథాలయ శాఖ జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆ సమయంలో స్థానికులు సమస్యలను విన్నవించారు.
            అయినా ఫలితం శూన్యం. నూతన భవన నిర్మాణానికి, సమస్యల పరిష్కారానికి ని«ధులు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నారు.
     
     
>
మరిన్ని వార్తలు