‘హృదయ’ వేదన

10 Aug, 2016 23:24 IST|Sakshi
తొలి ఆపరేషన్‌ గుర్తులు చూపుతున్న కిశోర్‌
చిన్నప్పుడు ఒక కంటి చూపు పోయింది. మిగిలిన కంటితోనే ప్రపంచాన్ని చూడడం నేర్చుకున్నాడు. ఊహ తెలిశాక అమ్మానాన్న చనిపోయారు. కుటుంబ బాధ్యతలను భుజానికెత్తుకుని నిత్యం బతుకు యుద్ధం చేశాడు. నిత్యం కష్టాలు వెంటాడేవి. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు ఆ మనిషి కాసింత సాయం కోరుతున్నాడు. పద్దెనిమిదేళ్లకే అరవై ఏళ్ల జీవిత సారాన్ని చూసిన ఆ యువకుడు ఇక పోరాడలేను... చేయూతనివ్వండని అర్థిస్తున్నాడు. గుండె జబ్బుతో బాధ పడుతున్న కిశోర్‌ అనే యువకుడి జీవితమిది. ఆయన హృదయం స్పందిస్తున్న తీరిది.
– పాలకొండ రూరల్‌
 
ఒకటి రెండు రోజులు కష్టంగా గడిస్తే కుంగిపోతాం. కానీ ఈ యువకుడు పద్దెనిమిదేళ్లుగా కష్టాల నావలోనే ప్రయాణిస్తున్నాడు. చిన్నప్పుడే చూపు పోయినా, ఊహ తెలిశాక తల్లిదండ్రులను కోల్పోయినా ఎవరి సాయమూ అర్థించని ఈ యువకుడు ఇప్పుడు కాసింత ఆసరా కోరుతున్నాడు. 
పాలకొండ పట్టణానికి చెందిన కలిశెట్టి కిశోర్‌కు పద్దెనిమిదేళ్లు. పుట్టుకతోనే ఎడమ కంటి చూపును ఇతను కోల్పోయాడు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను చూడడం మొదలు పెట్టాడు. వయసుకు మించిన కష్టాలు అనుభవించాడు. చదువు ఆపేసి బంధువుల ఇంటిలో ఉంటూ దుకాణాల్లో పనిచేయడం ఆరంభించాడు. పదహారేళ్ల వయసులో కిశోర్‌కు గుండె నొప్పి వచ్చింది. మొదట తేలికగా తీసుకున్నా తరచూ బాధిస్తుండడంతో తర్వాత వైద్యులకు చూపించాడు. కొన్ని రోజులు మందులు వాడినా ఫలితం లేకపోయింది. తర్వాత స్థానికంగా ఓ వైద్య శిబిరంలో చూపించుకుంటే గుండెకు సమస్య ఉందని, శ్రీకాకుళంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి రావాలని వైద్యులు సూచించారు. ఈ యేడాది మార్చిలో ఆస్పత్రికి Ðð ళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు రంధ్రం ఉందని ఆపరేషన్‌ చేస్తామని చెప్పి ఆపరేషన్‌ చేశారు. అక్కడితో సమస్య సమసిపోయిందనుకున్న కిశోర్‌కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. 
 
గుండెను కోసిన వైద్యులు గుండెలో రంధ్రం లేదని చెప్పి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. దీంతో కిశోక్‌ మరేమీ చేయలేక యధావిధిగా పనుల్లోకి వెళ్లిపోతున్నాడు. కిశోర్‌ పరిస్థితిన చూసి చలించిన పట్టణానికి చెందిన కొండదాడి శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్‌ సీపీ నేత దుంపల రమేష్‌ తదితరులు ప్రధాన మార్కెట్‌లో రూ.18వేలు వరకు చందాలు వసూలు చేసి కిశోర్‌ను హైదరాబాద్‌లోకి కిమ్స్‌కు తీసుకెళ్లారు. గుండె ఎడమ పక్క సమస్య ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా సర్జరీ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆస్పత్రి ఖర్చులు, దారి ఖర్చులకు కూడా కిశోర్‌ దగ్గర డబ్బులు లేవు. తోడుండి సాయం చేసే వారు కూడా ఎవరూ లేకపోయారు. దీంతో కిశోర్‌ రోజురోజుకూ మానసికంగా కుంగిపోతున్నాడు. తను దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయని, దాతలు సాయం చేస్తే బతుకుతానని ఆశ పడుతున్నాడు. సాయం అందించాలనుకునే వారు 7675979167 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరాడు. 
 
 
మరిన్ని వార్తలు