గాల్లోనే ఊపిరి పోశారు!

2 Oct, 2023 05:07 IST|Sakshi

ఆర్నెల్ల హృద్రోగ చిన్నారికి హఠాత్తుగా శ్వాస సమస్య

వెంటనే స్పందించి చికిత్స చేసిన వైద్యులు

వారిలో ఒకరు ఐఏఎస్‌ అధికారి

ఇండిగో విమానంలో ఉది్వగ్న క్షణాలు

న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు.

విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్‌ కిట్‌ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్‌ హోస్టెస్‌ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్‌ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ 15 నిమిషాలు...
ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్‌ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్‌ నితిన్‌ కులకరి్ణ. జార్ఖండ్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్‌ మొజమ్మిల్‌ ఫిరోజ్‌. రాంచీలోని సదర్‌ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్‌ డక్టస్‌ అర్టరియోసిస్‌ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్‌ అందివ్వడంతో పాటు థియోఫైలిన్‌ ఇంజక్షన్‌ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్‌ కూడా బాగా పని చేసింది. హార్ట్‌ బీట్‌ ను స్టెతస్కోప్‌ తో చెక్‌ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు.

మరిన్ని వార్తలు