ఓటమే పాడిస్తుంది విజయ 'గీతం'

18 Mar, 2016 12:22 IST|Sakshi
ఓటమే పాడిస్తుంది విజయ 'గీతం'

ఓటమి ఎదురైందని డీలా పడిపోకూడదు,  ఓటమి విజయానికి నాంది అన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి అన్నారు. సినీ నేపథ్య గాయకలు మల్లికార్జున్, గోపికా పూర్ణిమా దంపతులు. భోగాపురం సమీపంలోని దెంకాడ మండలం బంటుపల్లి గ్రామదేవత  శ్రీకనకదుర్గమ్మ జాతరలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి  వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో పంచుకున్న ముచ్చట్లవి.

పాటంటే ప్రాణం
నాది విశాఖ జిల్లా అనకాపల్లి. చిన్నప్పటి నుంచి సినిమాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని. మా అమ్మ, అక్క ఎక్కువగా పాటలు పాడేవారు. వాళ్లే నాకు స్ఫూర్తి. దీంతో చిన్నప్పటి నుంచి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సినీ గీతాలు పాడుతూ, పాటలు పాడేవాడిని. దీంతో అంతా మంచి గాయకుడివి అవుతావని అంటుండటంతో ఉత్సాహం పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ప్రాణం. సంగీత దర్శకుల్లో ఇళయరాజా అంటే దైవంతో సమానం. గాయకులకు వివిధ చానళ్ఉల నిర్వహిస్తున్న 'సూపర్ సింగర్',  'పాడుతా తీయగా' తదితర కార్యక్రమాలు చక్కని వేదికలుగా నిలుస్తాయి.

విజయనగరం అమ్మాయినే....
నా జన్మస్థలం విజయనగరం. విద్యాభ్యాసం హైదరాబాద్లో జరిగింది. విద్యల నగరం విజయనగరంలో జన్మించడం నా అదృష్టం. 1999 నుంచి సినీ నేపథ్య గాయనిగా కొనసాగుతున్నాను. సినిమాలో పాటల కన్నా ఎక్కువగా భక్తిగీతాలు, సాయిబాబా భక్తి పాటలు ఆల్బమ్స్కు పని చేశాను. మల్లితో పాటు పలు సినిమాల్లో పాటలు పాడాను. జల్సా, బొమ్మరిల్లు, శంకర్ దాదా జిందాబాద్, నాని సినిమాల్లో పాడిన పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీతంపై ఆసక్తి ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడమే నా లక్ష్యం.
- గోపికా పూర్ణిమ

'సింగన్న'తో పాటల ప్రయాణం
తొలుత 1997లో సింగన్న చిత్రంలో 'కలగంటి... కలగంటి పాటతో సినీ గాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది. ఆది సినిమాలో నీ నవ్వుల చల్లదనాన్ని..., ఇంద్రలో ఘల్లు ఘల్లుమని..., ఠాగూర్లో మన్మధ... మన్మధ..., ఒక్కడులో సాహసం... శ్వాసగా..., గుడుంబా శంకర్లో చిట్టి నడుమనే చూస్తున్నా...తోపాటు పలు పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి. కత్తి కాంతారావు సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాను. నేపథ్య గాయకుడినైనా... రాబోయే రోజుల్లో మంచి సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకోవడమే నా ఆశయం. కొత్తగా వస్తున్న గాయకులు ఆవకాశాలు రానప్పుడు నిరాశ పడకూడదు. ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుని వస్తాయి. అంతవరకు పట్టుదలతో కృషి చేయాలి
- మల్లికార్జున్

మరిన్ని వార్తలు