‘పిక్కల’ లెక్కతో చుక్కలు

18 Jul, 2016 12:16 IST|Sakshi

పార్వతీపురం:
కొమ్ములు తిరిగిన ఐఏఎస్ అధికారి ఐటీడీఏ పీవోగా వచ్చినా అధికారులు చెప్పినట్టు వినాల్సిందే.. కొన్నాళ్లుగా పార్వతీపురం ఐటీడీపై వినిపించే బలమైన ఆరోపణ. పీవోగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఐటీడీఏ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వి.ప్రసన్న వెంకటేష్‌ను కూడా అదే దారిలో అధికారులు నడిపిస్తున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు కొనాల్సిన జీడిపిక్కలను ఎక్కువ ధరకు కొనేందుకు టెండర్ ఖరారు చేయడమే దీనికి నిదర్శనం.

బాపట్ల రకం మంచిదన్న సాకుతో ..
ఈ ఏడాది పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని ఆయా 8 మండలాల్లో దాదాపు 5వేల ఎకరాల్లో జీడితోటల పెంపకానికి సన్నాహాలు ప్రారంభించారు. ఉపాధి నిధులతో జీడితోటల పెంపకాన్ని చేపడుతున్న తరుణంలో ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం కిలో జీడిపిక్కలు రూ.139 కంటే అదనపు ధరకు కొనుగోలు చేయరాదు. కానీ బాపట్ల రకం మంచిదన్న పేరుతో రూ.139 విలువ చేసే కిలో జీడిపిక్కలను రూ.210కు ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో కిలో జీడిపిక్కల ధర రూ.130 పలుకుతున్నట్లు సమాచారం.

టెండర్ల కంపెనీలపై అనుమానాలు...
 ఏటా ఇదే సీజన్‌లో జీడి పిక్కలు, వేప పిండి, వర్మీ కంపోస్టు టెండర్లు పడిన వెంటనే సరుకు సరఫరాకు వచ్చే సంస్థల వ్యక్తులే పేర్లు మార్చి అదే పేరుతో రావడం సాధారణం. ఈ ఏడాది కూడా టెండర్లు వేసిన సంస్థలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఓ అధికారి గతంలో పనిచేసి వచ్చిన ప్రాంతానికి చెందిన కొన్ని సంస్థలు టెండర్లు వేయడం సందేహాలకు తావిస్తోంది. నరసన్న పేటకు చెందిన సాయికృష్ణా ఎంటర్ ప్రైజస్‌కు మార్కెట్ రేటు, ప్రభుత్వ రేటు కన్నా అధికంగా టెండర్లు ఖరాారు చేయడం గమనార్హం. కొన్నేళ్లుగా ఐటీడీఏ హార్టీకల్చర్ శాఖ వ్యవసాయానికి వేపపిండి పేరుతో మట్టిముద్దలు సరఫరా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లోటస్ బయోటిక్‌కు ఈ ఏడాది కూడా టెండర్లు ఖరారు చేయడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ధరల్లో వ్యత్యాసం
 వేప పిండి కిలో రూ.9.30కు డీసీఎంఎస్ సరఫరా చేస్తున్న తరుణంలో ఈ ఏడాది రూ.9.90కు టెండర్లు ఖరారు చేశారు. రూ.3 ధర పలికే వర్మీకంపోస్టును రూ.6కు ఖరారు చేశారు. గతంలో పంపిణీ చేసిన వేపపిండి, వర్మీకంపోస్టు నాణ్యత లేదంటూ గిరిజనులు ఇప్పటికీ వాడకుండా పక్కన పడేశారు. మట్టిముద్దలు, చెత్తా చెదారం పంపిణీ చేశారని అప్పట్లో వారు మండిపడ్డారు. జూలై చివరికల్లా జీడి వేయాల్సి ఉంది. తర్వాత వేస్తే మొలకలు అనుమానమేనని గిరిజనులంటున్నారు.

అంతా పారదర్శకమే...
 టెండర్లు పారదర్శకంగానే జరిగాయి. మార్కెట్‌లో సాధారణ రకం రూ.130 పలుకుతున్నా బాపట్ల రకం బాగుంటుందని బీపీపీ 6, 8 రకాలకు టెండర్లు ఖరారు చేశాం. వీటిని రీసెర్చ్ సెంటర్ ధ్రువీకరిస్తుంది. ఈ ఏడాది పంట తక్కువగా ఉండటంతో జీడి ధర దాదాపు రూ.50 వరకు పెరిగింది. ఇప్పుడు ఖరారు చేసిన జీడిపిక్కలను గ్రేడింగ్ చేస్తారు. నీటిలో తేలినవి ఇస్తారు. వేప పిండి, వర్మీకంపోస్టు నమూనాలను నాగపూర్ పంపిస్తాం. బాపట్ల సీడ్ కావాలని టెండర్ ప్రకటిస్తే ఎవరూ రాకపోవడంతో రెండుసార్లు వాయిదా వేశాం. చివరికి వచ్చిన వారిని ఖరారు చేశాం. కమిటీ సోమవారం జీడిపిక్కలను గ్రేడింగ్ చేసి తెచ్చేందుకు వెళ్తోంది.
 - ఆర్‌వీవీ ప్రసాద్,  ప్రాజెక్టు హార్టీకల్చర్ అధికారి, ఐటీడీఏ

మరిన్ని వార్తలు