పంటలు కళకళ.. ఆశలు మిలమిల

31 Jul, 2016 18:23 IST|Sakshi
పంటలు కళకళ.. ఆశలు మిలమిల
  • రోజూ కురుస్తున్న వర్షాలు
  • ఆనందంలో రైతన్నలు
  • రాయికోడ్‌:ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పచ్చదనం సంతరించుకుని చేళన్నీ కళకళలాడుతున్నాయి. మండలంలోని రాయికోడ్‌, పీపడ్‌పల్లి, మహమ్మదాపూర్‌, యూసుఫ్‌పూర్‌, ఇటికేపల్లి, సింగితం, కర్చల్‌, ఇందూర్‌ తదితర 25 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ఏడాది 7,500 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి సాగును తగ్గించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం 1500 హెక్టార్లు తగ్గింది. పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో పత్తి మొక్కల ఎదుగుదల జోరందుకుంది.

    ఏపుగా పెరుగుతున్న పత్తి సాళ్లలో రైతులు దౌరగొట్టే పనులు చేపడుతున్నారు. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో గరకు నేలల్లో వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో పంటకు నష్టం వాటిల్లకుండా రైతుకు అవసరమైన రసాయనాలను పిచికారి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో రైతులు పత్తి పంట దిగుబడిపై ఈ ఏడాది భారీ ఆశలు పెట్టుకున్నారు. పత్తి పంట చేతికందే వరకు వాతావరణం అనుకూలిస్తే ఎకరా విస్తీర్ణానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొన్నారు.

    అదేవిధంగా మండలంలో సాగు చేస్తున్న సోయాబీన్‌, పెసర, మినుము తదితర పంటలు సైతం ఆశాజనకంగా ఎదుగుతున్నాయి. మండలంలో ఈ ఏడాది 1,000 హెక్టార్లలో సోయాబీన్‌, 800 హెక్టార్లలో పెసర, 500 హెక్టార్లలో మినుము పంటలను సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా సరైన వర్షాలు లేక తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నామని ఈసారైనా పంటలు పండి తమ ఇబ్బందులు తీరాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు