పథకాలను అందిపుచ్చుకోవాలి | Sakshi
Sakshi News home page

పథకాలను అందిపుచ్చుకోవాలి

Published Sun, Jul 31 2016 6:21 PM

పథకాలను అందిపుచ్చుకోవాలి

ఎస్సీ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌
 
గుంటూరు వెస్ట్‌: ప్రభుత్వం దళితుల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్‌ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ కోరారు. జిల్లా ఎస్సీ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరులోని సన్నిధి కళ్యాణ మండపంలో యువస్ఫూర్తి సమ్మేళనం శనివారం జరిగింది. ఈసందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత చదువుకున్న దళిత యువతపై ఉందన్నారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా అర్హులైన వారికి పథకాలను అందించేందుకు కృషి చేయాలని కోరారు.  దళితులు మేథోబలం ద్వారా అభివృద్ధిని సాధించి జాతి ఉద్దరణకు పాటుపడాలని ఆయన కోరారు. అంబేద్కర్‌ జీవితంలోని పలు అంశాలను  ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
లక్ష్యం కోసం పనిచేస్తే ఉన్నతస్థానాలు..
జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ దిశా కలిగి ఉండి ఒక లక్ష్యం కోసం కృషి చేస్తే యువత ఉన్నతస్థానాలకు ఎదగవచ్చన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగించుకోవాలని కోరారు. తొలుత బీఆర్‌ అంబేద్కర్, బాబూజగ్జీవన్‌రామ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.కాలేబ్, డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కే.బాలాజీనాయక్, దళిత యువతీ, యువకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.  సాయంత్రం దళిత సంఘాల నాయకులు, ఎన్‌జీఓ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 
నిరాశగా వెనుదిరిగిన యువకులు..
సమ్మేళనానికి వచ్చినవారికి ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా రుణాలు అందిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఈవిధంగా చెప్పి తమను సమావేశానికి పంపించారని పలువురు యువకులు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయాన్ని  ఒకరిద్దరు యువకులు ఎం.డీ.విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకు వచ్చారు. ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా రుణాలు ఇస్తారని చెబితే ఇక్కడకు వచ్చామని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు.  తీరా ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు కానీ, రుణాల ఊసే లేకపోయేసరికి యువకులు ఉస్సూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement