ఖనిజం అక్రమ రవాణా

19 Aug, 2016 17:19 IST|Sakshi
ఖనిజం అక్రమ రవాణా
ఆలస్యంగా వెలుగుచూసిన అక్రమార్కుల దోపిడీ
 
బొల్లాపల్లి: ముడి ఖనిజం అక్రమ తరలింపు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్లవిలువ జేసే లెడ్‌ జింక్‌ ముడి సరుకు అక్రమ రవాణాకు అక్రమార్కులు నడుం బిగించారు. పాలకపార్టీ నాయకుల అండదండలతో స్థానిక నాయకులు ఈ అక్రమ దోపిడీకి శ్రీకారం చుట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో బండ్లమోటు మైనింగ్‌ 1965లో ప్రారంభమైంది. అనంతరం నష్టాబాటలో ఉన్న కంపెనీ 2002లో మూతపడింది.  అప్పట్లో కొన్ని వేల టన్నులు ముడి సరుకు మైనింగ్‌ పక్కనే పడిఉంది. వేల కోట్ల విలువచేసే ఈ రాయి అక్రమ రవాణాపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. 2013తో మైనింగ్‌ లీజ్‌ రద్దవడంతో ఈ ప్రాంతమంతా అటవీ శాఖ అదీనంలోకి వచ్చింది. టిడిపి అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి కొందరు వచ్చి పరిశీలించి వెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. గత రెండు నెలలుగా క్వారీ ప్రాంతం నుంచి రెండు ధపాలుగా ముడి సరుకు అక్రమంగా తరలివెళ్లిందని, ఈ సరుకు అక్రమ తరలింపు అటవీ శాఖాధికారుల కనుసన్నల్లో జరిగిందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
టిప్పర్లను అడ్డుకున్న యువకులు..
గురువారం తెల్లవారుజామున ఆరు టిప్పర్లు, పెద్ద ప్రోక్లెయినర్‌ బండ్లమోటు మైనింగ్‌లోకి ప్రవేశించి అక్రమంగా తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకులు గమనించి టిప్ఫర్లును అడ్డుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు  సమాచారం అందించారు. ఫారెస్టు సిబ్బంది సంఘటన ప్రాంతానికి చెరుకొని వాహనాల వివరాలు సేకరించారు. నిబందనల ప్రకారం అర్ధరాత్రివేళ అటవీ సంపదను కొల్లగొడుతున్న వాహనాలను సీజ్‌ చేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో వాహనాలు సంఘటన ప్రాంతం నుంచి వెళ్లిపోవడం, పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమంగా తరలించిన ముడిసరుకు పక్కనే ఉన్న రేమిడిచర్ల గ్రామానికి సమీపంలోని దంతెలకుంట పోలాల్లో నిలువచేశారు. సుమారు వంద టన్నుల ముడిసరుకు అక్రమంగా తరలివెళ్లినట్లు తెలుస్తుంది. టన్ను ముడి సరుకు విలువ సుమారు లక్షన్నర వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. స్థానిక యువకులు అడ్డగించడంతో ఈవిషయం వెలుగుచూసింది. మూసివేసిన మైనింగ్‌ నుంచి సరుకు రవాణాకు దట్టంగా మెలచిన  అటవీ ప్రాంతంలోని కలపను నరికివేసి దారి ఏర్పాటు చేసి  అక్రమంగా తరలిస్తున్నారు.
 
అక్రమ తరలింపు వెనుక పెద్దల హస్తం..?
ఉన్నత స్థాయి పాలనా యంత్రాంగం అండదండలతో అక్రమంగా తరలివెళ్తోందని, ముడిసరుకును కడప జిల్లాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు వాపోతున్నారు. కోట్ల అటవీ సంపదను అక్రమార్కుల నుంచి కాపాడాలని బండ్లమోటు గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు