హత్యల కోసం సుపారీ ఇచ్చిన రైల్వేశాఖ | Sakshi
Sakshi News home page

హత్యల కోసం సుపారీ ఇచ్చిన రైల్వేశాఖ

Published Fri, Aug 19 2016 5:13 PM

హత్యల కోసం సుపారీ ఇచ్చిన రైల్వేశాఖ

అదేంటి.. రైల్వే శాఖ ఏంటి, హత్యలు చేయించడానికి సుపారీ ఇవ్వడం ఏంటనుకుంటున్నారా? చార్‌బాగ్ రైల్వేస్టేషన్‌లో ఎలుకలను చంపడానికి నెలకు రూ. 35వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదంతా ఎందుకని మొత్తం ప్లాట్‌ఫారాలను తవ్విపారేస్తున్న వందలాది ఎలుకలన్నింటినీ పట్టుకుని చంపడానికి ఓ ప్రైవేటు కంపెనీకి రూ. 4.76 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు. వీటివల్ల రైల్వే ఆస్తులకు, ఫైళ్లకు తీవ్రమైన నష్టం కలుగుతోంది.

ఇంతకుముందు 2013 సంవత్సరంలో కూడా ఎలుకలను చంపడానికి ఓసారి కాంట్రాక్టు ఇచ్చినా, వాళ్లు సరిగా ఆ పని చేయలేకపోయారు. గడిచిన ఏడాది కాలంలో ప్లాట్‌ఫారం మీద వివిధ వస్తువులు అమ్ముకునేవారికి రూ. 10 లోల వరకు నష్టం కలిగిందని, దాంతో ఈ అమ్మకందారులే కాక.. ప్రయాణికులు కూడా ఎలుకలంటే భయపడిపోతున్నారని, చివరకు క్లోక్‌రూంలలో భద్రపరిచిన సామాన్లను కూడా ఈ ఎలుకలు వదలడం లేదని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు ఇన్ని ఎలుకలను చంపాలని లక్ష్యం ఏమీ పెట్టలేదని, వాళ్లు చంపిన ఎలుకలను చార్‌బాగ్ రైల్వేస్టేషన్ చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ చెక్ చేస్తారని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. ప్లాట్‌ఫారాల కింద ఎలుకలు ఏకంగా కాలనీలు ఏర్పాటుచేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం ఏడాది పాటు ఉండే కాంట్రాక్టులో భాగంగా కంపెనీవాళ్లు 25 సార్లు స్టేషన్‌కు వస్తారన్నారు.

ఎలుకలు మొత్తం అన్ని ప్లాట్‌ఫారాలను తవ్వేశాయని, అవి ఐదో నెంబరు ప్లాట్‌ఫారం నుంచి లోపలకు ప్రవేశించి, రెండో నెంబరు ప్లాట్‌ఫారం నుంచి బయటకు వస్తాయని సూరజ్ కుమార్ అనే వ్యాపారి చెప్పారు. ఒక్కో ఎలుక బరువు అరకిలోకు పైగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండకపోతే పిల్లలను కూడా కరుస్తున్నాయని బ్రిజేష్ సింగ్ అనే ప్రయాణికుడు చెప్పారు. ఎలుకలను చంపేవాళ్లు మొత్తం స్టేషన్‌లోని అన్ని ప్రాంతాల్లోను తమ పని చేస్తారని, వాటికోసం మందు కలిపిన ఆహార పదార్థాలను సిద్ధం చేస్తారని అంటున్నారు. మొదట్లో ఎలుకలను చంపే కాంట్రాక్టు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నా.. రాను రాను వీటి బాధ మరీ భరించలేనిదిగా తయారు కావడంతో మొత్తం దాదాపు రూ. 5 లక్షలు వెచ్చించక తప్పడం లేదట.

Advertisement
Advertisement