కాకతీయ కాల్వపై మినీ రిజర్వాయర్లు

27 Sep, 2016 22:53 IST|Sakshi
కాకతీయ కాల్వపై మినీ రిజర్వాయర్లు
  • నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించండి 
  • రిటైర్డ్‌ ఇంజనీర్లను కోరిన మంత్రి ఈటల
  • నాలుగు జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాలకు ఎల్‌ఎండీయే ఆధారం
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : దిగువ మానేరు జలాశయం నుంచి మూసీ వరకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే ఒక్క జలాశయాన్ని కూడా గత పాలకులు నిర్మించకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని దాదాపు 9.5 లక్షల ఎకరాలకు ఎల్‌ఎండీయే ప్రాణాధారమైందన్నారు. డ్యాం నిండితే ఆయా జిల్లాలకు సాగునీరందుతుందని, లేకుంటే లేదని అన్నారు. కాకతీయ కాల్వపై ఒక టీఎంసీ నుంచి 5టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసేలా మినీ రిజర్వాయర్లు నిర్మిస్తే తద్వారా ఆయా జిల్లాల్లోని నిర్దేశిత ఆయకట్టుకు సాగునీందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం నేతలను మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం నేత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఇంజనీర్ల బృందంతో మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ మంగళవారం ఎల్‌ఎండీ అతిథిగృహంలో సమావేశమయ్యారు. మిడ్‌మానేరు ఆనకట్ట 130 మీటర్ల మేరకు కోతకు గురవడంతోపాటు మానాలవద్ద కాకతీయ కాల్వకు గండిపడిన అంశంపై చర్చించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద పడిన గండిని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పకడ్బందీ సూచనలివ్వాలని కోరారు. మంత్రి సూచనల మేరకు కాకతీయ కాలువపై మరిన్ని రిజర్వాయర్లు నిర్మించే అంశంపై అధ్యయనం చేస్తామని రిటైర్డు ఇంజనీర్ల బృందం నేత శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అనంతరం వారు భారీ వర్షాలు, వరదలతో గండిపడిన మిడ్‌మానేరు, కాకతీయ కాలువలను సందర్శించారు. మిడ్‌మానేరు ఆనకట్టకు గండిపడటంతోపాటు 130 మీటర్ల మేరకు కోతకు గురికావడాన్ని పరిశీలించారు. మానాల వద్ద కాకతీయ కాలువకు గండిపడటానికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. మానాలవద్ద ఏర్పాటు చేసిన స్లూయీస్‌ను మరో 150 మీటర్ల దిగువన ఏర్పాటు చేస్తే గండిపడే అవకాశం ఉండేది కాదని రిటైర్డు ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. వీటిపై త్వరలోనే తాము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 
    10 లక్షల ఎకరాలకు లాభమైంది : ఈటల
    భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో వెయ్యి ఎకరాలకు నష్టం జరిగితే దాదాపు పది లక్షల ఎకరాలకు లాభం జరిగిందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎల్‌ఎండీని సందర్శించారు. వరదలతో డ్యాంలో నీరు చేరి కళకళలాడుతుండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టడం చేయడంతోపాటు డ్యాం పొడువునా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు పడిపోయిన వారిని రక్షించేందుకు బోట్స్, లైవ్‌జాకెట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. 72 గంటలుగా నిరంతరాయంగా పర్యవేక్షించడంవల్ల భారీ నష్టం వాటిల్లకుండా కాపాడగలిగామని తెలిపారు. జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనాలు వేసి రైతులను ఆదుకుంటామన్నారు. జిల్లాలో 5,500 చెరువులుంటే 132 చెరువులు తెగిపోయాయన్నారు. మిషన్‌ కాకతీయ చెరువులు మాత్రం చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చే యాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.  
     
     
మరిన్ని వార్తలు