దటీజ్‌ జగన్నాథం!

26 Jul, 2017 23:12 IST|Sakshi

- మంత్రి సునీతకు పీఏగా పని చేసిన టీచరు బదిలీ
-  సిండికేట్‌నగర్‌ స్కూల్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- విరుద్ధంగా కౌన్సెలింగ్‌ సమయంలో ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా విమర్శలు
- కమిషనర్‌ ఉత్తర్వుల మేరకే స్కూల్‌ కేటాయించామంటున్న డీఈఓ


అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కొదవండదనే’ నానుడికి అద్దంపట్టేలా ఉంది ప్రభుత్వ తీరు. నిబంధనలు సామాన్యులకు తప్ప తమలాంటి వారికి కాదని అధికార పార్టీ నేతలు నిరూపించారు. తాజాగా విద్యాశాఖలో బదిలీలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మంత్రి పరిటాల సునీత పీఏగా పని చేసిన బయాలజికల్‌ సైన్స్‌ టీచరు జగన్నాథంను అనంతపురం రూరల్‌ సిండికేట్‌నగర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, చట్టాలు చేయాల్సిన వారే వాటిన అపహాస్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సామాన్య టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జగన్నాథం సోమందేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బయాలజికల్‌ సైన్స్‌ టీచరుగా పని చేస్తున్నారు. ఈయన మంత్రి పరిటాల కుటుంబానికి సమీప బంధువు. కొన్నేళ్లుగా సునీతకు అధికారికంగా పీఏగా పని చేస్తున్నారు. అయితే టీచర్లు బడిలోనే ఉండాలి తప్ప బోధనేతర పోస్టుల్లో ఉండకూడదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా ఉన్న టీచర్ల డెప్యుటేషన్లు రద్దు చేస్తూ వారిని బడికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రి పరిటాల సునీత పీఏగా పని చేసిన జగన్నాథంను రిలీవ్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో బడికి వెళ్లాల్సి వచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు: నిబంధనల ప్రకారం బదిలీ షెడ్యూలు విడుదలయిన తర్వాత ఎలాంటి బదిలీలను ప్రభుత్వం చేపట్టకూడదు. అయితే జగన్నాథం విషయంలో ఇందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంది. ఆయన బదిలీ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారికి రిమార్క్సు అడిగింది. ఈలోపు బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఇంతటితో ఈ ప్రక్రియ ముగిసిందని భావించారు. తీరా కౌన్సెలింగ్‌ రోజు బుధవారం సిండికేట్‌ నగర్‌ పాఠశాలకు జగన్నాథంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపైఅమలు చేశారు. వాస్తవానికి సిండికేట్‌నగర్‌ స్కూల్‌లో క్లియర్‌ వేకెన్సీ ఉంది. ఖాళీల జాబితాలో కూడా చూపించారు. తీరా కౌన్సెలింగ్‌ సమంయలో ఖాళీల జాబితాలో ఆ స్కూల్‌ పేరు గల్లంతుకావడంతో టీచర్లు అవాక్కయ్యారు. దీనిపై డీఈఓ లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ...జగన్నాథంను సిండికేట్‌నగర్‌ స్కూల్‌కు బదిలీ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారని వాటిని అమలు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు