కాల్‌మనీ ఉచ్చులో ఎమ్మెల్యే పీలా

8 Jul, 2017 07:40 IST|Sakshi

సీపీకి పెందుర్తి మండలానికి చెందిన ఓ కుటుంబం ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం/అల్లిపురం: నిన్న గాక మొన్న పొక్లె్లయిన్‌తో ప్రహరీని కూలగొట్టిన ఘటనలో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఈయనపై కేసు నమోదైంది. ఇది మరవకముందే కాల్‌మనీ వ్యవహరంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వడ్డీవ్యాపారస్తులతో చేతులు కలిపి సెటిల్‌ మెంట్స్‌కు పాల్పడుతున్నారు. అప్పు తీర్చలేదనే అక్కసుతో పెందుర్తిలోని ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన అరకోటికి పైగా విలువైన స్థిరాస్తిని కాజేసేందుకు ఏకంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు అందింది.

బాధితుల తెలిపిన వివరాల ప్రకారం ..
పెందుర్తి మండలం రాతిచెరువుకు చెందిన షేక్‌ ఆదంబీ  భర్త షేక్‌ మహ్మద్‌ఆలీతో కలిసి సర్వే నం.237/5బిలోని డోర్‌ నం.4–63/1లో నివసిస్తోంది. పెందుర్తి, విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్న వీరు 2015 జూన్‌లో దేశపాత్రునిపాలేనికి చెందిన ఫైనాన్షియర్‌ రమణ నుంచి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తానికి గతేడాది నవంబర్‌ వరకు వడ్డీతో కలిసి రూ.6 లక్షలు వరకు చెల్లించారు. నోట్ల రద్దు తర్వాత వడ్డీ చెల్లించలేకపోయారు. బాకీ చెల్లించాలని రమణ ఒత్తిడి తీసుకు వచ్చాడు. ఆర్థికభారం కావటంతో వారు ఉంటున్న ఇంటిని అమ్మకానికి  పెట్టి వడ్డీతో కలిసి సింగిల్‌ పేమెంట్‌గా రూ.5లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు.

ఆ మేరకు మరొకరికి ఇంటిని అమ్మకానికి పెట్టి రూ.18 లక్షలు అడ్వాన్సు తీసుకున్నారు. ఆ మొత్తం నుంచి రూ.5 లక్షలు ఫైనాన్షియర్‌ రమణకు ఇచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అమ్మకానికి పెట్టిన రాతిచెరువులోని బాధితుల ఇంటిని కబ్జా చేసే ఆలోచనతో ఫైనాన్షియర్‌ రమణ అనకాపల్లి ఎమ్మెల్యే ద్వారా బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పు తీసుకున్నప్పుడు ఖాళీ పేపర్లపై పెట్టిన సంతకాలను ఆసరాగా చేసుకుని సదరు వడ్డీ వ్యాపారి పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఆ ఇంటిని తమకు తనఖా పెట్టి సదరు వ్యక్తులు రుణం పొందారని, ఇంటిని ఎవరు కొనుగోలు.. అమ్మకాలు చేయడానికి వీల్లేదని సదరు ప్రకటన సారాంశం.అంతటితో ఆగకుండా సంతకాలు తీసుకున్న కాగితాలపై వంద రూపాయల స్టాంపులు అతికించి బాధితులు ఉంటున్న రాతిచెరువులోని ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.

బాధితులు ప్రతిఘటించటంతో వడ్డీ వ్యాపారస్తుడు విషయాన్ని ఎమ్మెల్యే పీలా గోవింద్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌సత్యనారాయణ రమ్మంటున్నారని ఫైనాన్సర్‌ రమణతోపాటు మరో పదిమంది  వెళ్లి బాధితులను  గురువారం సాయంత్రం 4గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు.అక్కడ సుమారు మూడు గంటల పాటు ఒక గదిలో బాధితురాలు షేక్‌ ఆదంబీ, ఆమె కుమార్తె షేక్‌ అఫ్రోజ్‌ల పట్ల కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నానా దుర్భాషలాడారు. మీ ఇంటిని మర్యాదగా అప్పగించండి లేకపోతే మీ అంతు చూస్తాం అంటూ ఎమ్మెల్యే పీలా గోవింద్, వడ్డీ వ్యాపారస్తుడు రమణలతో పాటు మరొక డాక్టర్‌ బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

మీ ఇంటిని నేనే కబ్జా చేస్తాను ఏం చేస్తారో చూస్తాను అంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ తమను బెదిరించాడని బాధితులు సీపీకి ఫిర్యాదు చేసిన కాపీలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోవింద్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆయన నుంచి తమకు  రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ టి.యోగానంద్‌ను కలసి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.  కేసును జోన్‌–2, శాంతిభద్రతల డీసీపీ రవికుమార్‌ మూర్తికి అప్పగించినట్లు సీపీ యోగానంద్‌ తెలిపారు.