నగదు విత్‌డ్రా ఫారం రూ.10

18 Dec, 2016 04:15 IST|Sakshi
నగదు విత్‌డ్రా ఫారం రూ.10
పిడుగురాళ్ళ టౌన్‌: నోట్ల రద్దు, కొత్త కరెన్సీ జారీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో వెలుగుచూస్తోన్న విచిత్రాలు అన్నీఇన్నీకావు. కొన్ని బ్యాంకుల్లో సిబ్బందే నేరుగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయం సీబీఐ, ఐటీ దర్యాప్తులో తేలింది. ఇంకొన్ని బ్యాంకుల్లోనైతే దళారీలు ఎంత చెబితే అంత! వృద్ధులు, రాయలేనివారికి డిపాజిట్‌, విత్‌డ్రా ఫారంలు నింపిపెడతామంటూ గుంటూరు జిల్లాలోని ఓ బ్యాంకులో తిష్టవేసిన దళారీ గ్యాంగ్‌ ఒక్కో విత్‌డ్రా ఫారానికి రూ.10 చొప్పున వసూలు చేస్తోంది. ఈ వ్యవహారం తెలిసి కూడా మిన్నకుండిపోయిన బ్యాంకు సిబ్బంది తీరు అనుమానాలకు తావిచ్చేలాఉంది.

జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వద్ద దళారులు విత్‌డ్రా ఫారాలను అమ్ముకుంటున్నారు. ముందుగానే బ్యాంకులో ఉన్న విత్‌డ్రా ఫారాలను తీసుకొని బ్యాంకు బయట విక్రయిస్తున్నారు. ఫారంతోపాటు పూర్తిచేసి ఇస్తే రూ.10 వసూలు చేస్తున్నారు. చదువురాని సామాన్యులు, వృద్ధులు తప్పని పరిస్థితుల్లో డబ్బులు వెచ్చించి ఫారాలను తీసుకుంటున్నారు. ప్రతిరోజు ఒక్కో బ్యాంక్‌ వద్ద వందలాది మంది ఖాతాదారులు వస్తుండటంతో వీరు వేలల్లో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఖాతాదారులు దళారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. విత్‌డ్రా ఫారాలు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు