పుర ఎన్నికలు మార్చి 5న!

12 Feb, 2016 02:31 IST|Sakshi
పుర ఎన్నికలు మార్చి 5న!

- ఈ నెల 20న ఎన్నికల ప్రకటన జారీ.. 15 రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ
- షెడ్యూల్ కుదిస్తూ ‘పుర’ ఎన్నికల నిబంధనలకు సవరణలు చేసిన సర్కారు

 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అపూర్వ విజయంతో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో పుర పోరుకు తెర తీయనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు మార్చి 5న ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికల ప్రకటన ఈ నెల 20న జారీ కానుంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు ముగిసిపోనున్నాయి.
 
 ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే ఈ నాలుగు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించేలా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వాటిలోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్లను ప్రకటిస్తూ వచ్చే సోమ లేదా మంగళవారం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే పైన పేర్కొన్న తేదీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది.
 
 వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల డివిజన్/వార్డు రిజర్వేషన్లను పురపాలక శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. వరంగల్, ఖమ్మంల్లో డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం... సిద్దిపేట, అచ్చంపేటల్లో వార్డు రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయడమే తరువాయి అని అధికార వర్గాలంటున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే సిద్దిపేట మున్సిపాలిటీలో ఆరు శివారు గ్రామాలను విలీనం చేయడాన్ని స్థానికులు ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసువేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై కొంతకాలంగా స్టే అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి ఇటీవల అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన పురపాలక శాఖ, స్టే తొలగింపు కోసం వచ్చే సోమవారం హైకోర్టులో పిటిషన్ వేయనుంది. ఆ రోజు హైకోర్టు స్టే తొలగించే పక్షంలో ఆ రోజు సాయంత్రంలోగా రిజర్వేషన్లను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 ఇదే ఊపులో మిగతా ఎన్నికలు
 రాష్ట్రమంతటా తమకు అనుకూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలోనే మిగతా ఎన్నికలనూ పూర్తి చేసే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. శనివారం జరగనున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే స్థాయి విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాస్త ముందు వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ రికార్డు మెజారిటీతో గెలవడం తెలిసిందే. అందుకే ఇదే ఊపులో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, వాటితో పాటు ఖాళీగా ఉన్న సిద్ధిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకూ వీలైనంత త్వరగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
 
 రెండు కార్పొరేషన్లలో సీఎం పర్యటనలు
 నగర ఓటర్లను ఆకట్టుకోవడంలో భాగంగా... ఎన్నికలు జరగాల్సిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో సీఎం కేసీఆర్ పర్యటనలు ఖరారయ్యాయని సమాచారం 15, 16 తేదీల్లో ఖమ్మంలో సీఎం పర్యటిస్తారని చెబుతున్నారు. వరంగల్‌లోనూ పర్యటిస్తారని సమాచారం. 19న ఆయన వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తారని, పర్యటనల తేదీలు ఆలోగా ఖరారవుతాయని తెలిసింది.  సీఎం పర్యటనలు ముగియగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారని అంచనా వేస్తున్నారు.  
 
 పుర ఎన్నికల షెడ్యూల్ 15 రోజులకు కుదింపు
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరహాలోనే రాష్ట్రంలోని ఇతర పురపాలికల ఎన్నికల షెడ్యూల్‌ను సైతం కుదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం తెలంగాణ పురపాలికల ఎన్నికల నిర్వహణ నిబంధనలను సవరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 26-21 రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇకపై వాటిని 15 రోజుల్లో ముగించేలా షెడ్యూల్‌ను కుదించారు.
 
 -    నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి నామినేషన్ల దాఖలుకు సెలవులతో సంబంధం లేకుండా గరిష్టంగా 3 రోజులు కేటాయిస్తారు. ఇది ఇప్పటిదాకా 4-7 రోజులుండేది.
 -    నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మర్నాడే పరిశీలన (స్క్రూటినీ) నిర్వహిస్తారు. సెలవులున్నా ఇందులో మార్పుండదు. ఇప్పటిదాకా నామినేషన్ల గడువు ముగిశాక 3 రోజుల వ్యవధిలో పరిశీలన జరిపేవారు.
 -    పరిశీలన మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఇదిప్పటిదాకా 3 రోజులుండేది.
 -    ఉపసంహరణ తర్వాత 9వ రోజు పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటిదాకా 12 రోజుల వ్యవధి ఉండేది.
 -    వార్డుల్లో కనీసం 8 గంటల పాటు పోలింగ్ నిర్వహించాలంటూ ప్రభుత్వం మరో సవరణ తీసుకొచ్చింది.
 
 నామినేషన్ల ఉపసంహరణలో సవరణ
 నామినేషన్ ఉపసంహరణ నిబంధనల్లోనూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఉపసంహరణ పత్రాలను నిర్ణీత వ్యవధిలో సదరు అభ్యర్థి సమర్పించకపోయినా తన ధ్రువీకరణతో కూడిన ఉపసంహరణ పత్రాలను తన ఎన్నికల ప్రతిపాదకుడి ద్వారా గానీ, ఎన్నికల ఏజెంట్ ద్వారా గానీ గడువులోగా ఎన్నికల అధికారికి సమర్పిస్తే దాన్ని కూడా ఇకపై పరిగణనలోకి తీసుకుంటారు.
 

>
మరిన్ని వార్తలు