రీ పోస్టుమార్టం చేయండి

12 Feb, 2016 07:13 IST|Sakshi
రీ పోస్టుమార్టం చేయండి

 సాక్షి, చెన్నై: ఎస్‌వీఎస్ వైద్య కళాశాల విద్యార్థిని శరణ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు మద్రా సు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్‌వీఎస్ సిద్ధ వైద్య కళాశాలకు చెందిన విద్యా కుసుమాలు మోనీషా, శరణ్య, ప్రియాంక అనుమానాస్పద స్థితిలో బావిలో గత నెల  శవాలుగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేస్తూ వస్తున్నది. అయితే, తమ కుమార్తె మృతిలో అనుమానం ఉందంటూ మోనీషా తండ్రి తమిళరసన్ కోర్టును  ఆశ్రయించారు. దీంతో మోనీషా మృత దేహానికి రీ పోస్టుమార్టం చెన్నైలో జరిగింది. ఈ నివేదిక హత్యే అన్న  అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది.
 
 ఈ పరిస్థితుల్లో తన కుమార్తె శరణ్య మృత దేహానికి కూడా రీ పోస్టుమార్టం చేయాలంటూ ఆమె తండ్రి ఏలు మలై కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన అభ్యర్థనను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. మృత దేహం ఖననం చేసి రెండు వారాలకు పైగా అవుతున్నదని, ఈ సమయంలో మళ్లీ రీ పోస్టుమార్టంకు ఆదేశాలు ఇవ్వలేమని బెంచ్ స్పష్టం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఏలుమలై అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ న్యాయమూర్తి సతీష్‌కుమార్ అగ్నిహోత్రి, న్యాయమూర్తి వేణుగోపాల్ నేతృత్వంలో బెంచ్ ముందుకు గురువారం వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది శంకర సుబ్బు వాదనలు విన్పించారు.
 
 అయితే, ప్రభుత్వం తరపు న్యాయవాది షణ్ముగ వేలాయుధం రీ పోస్టుమార్టంకు అడ్డు తగులుతూ వాదన విన్పించారు. దీంతో న్యాయమూర్తులు జోక్యం చేసుకుని పిటిషనర్ రీ పోస్టుమార్టం కోరుతుంటే, ప్రభుత్వానికి ఎందుకు ఇంత వ్యతిరేకత అని స్పందించారు. చివరకు రీ పోస్టుమార్టంకు ఆదేశించారు. అయితే, మృత దేహాన్ని ఖననం చేసిన చోటు రీ పోస్టుమార్టం జరగాలని సూచించారు. అలాగే, పిటిషనర్ కోరినట్టుగా, పోస్టుమార్టం బృందంలో వారి తరఫు డాక్టర్‌ను నియమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారి తరపు డాక్టర్ పోస్టుమార్టంను పర్యవేక్షించ వచ్చేగానీ, పోస్టుమార్టం జరపకూడదంటూ సూచించారు.
 

మరిన్ని వార్తలు