కర్నూలులో నందుల పండుగ

17 Jan, 2017 22:27 IST|Sakshi
కర్నూలులో నందుల పండుగ
– నేటి నుంచి రాష్ట్రస్థాయి నందినాటకోత్సవాలు
– ఫిబ్రవరి 2 వరకు నాటక ప్రదర్శనలు
– సినీ మాటల రచయిత దివాకర్‌బాబు, నటుడు కోటశంకర్‌రావు హాజరు
– పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, బాల నాటికల ప్రదర్శనలు
  
కర్నూలు(కల్చరల్‌): రంగస్థలంపై నంది నాటకానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని వివిధ నాటక సమాజాలు పలు సాంఘిక, పద్యనాటకాలు ప్రదర్శించవచ్చు. కాని ఒక నాటకం నంది నాటక పోటీలకు ఎంపిక కావడం, ఆ పోటీలలో విజేతగా నిలవడాన్ని రంగస్థల నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రంగస్థలంపై సరికొత్త సొగసులొలికే ఆహార్యపు సౌందర్యం.. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు.. రోమాలు నిక్క బొడ్చుకునే ఉత్కంఠ భరితమైన దృశ్యాలు.. కనువిప్పు కల్గించే సంభాషణలు.. సురభివారి సాంకేతిక తరం గురించిన అద్భుతాలు.. మొత్తంగా కర్నూలు నగరంలో పదునైదు రోజుల పాటు నందుల పండుగ జరగనున్నది. ప్రేక్షకులకు వీనుల విందు కనుల విందు కల్గించే ఈ నందుల పండుగ కర్నూలు నగరానికి తొలిసారిగా తరలి వచ్చింది. గతంలో 2010లో నంద్యాల టౌన్‌ హాల్‌ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు జరిగాయి. 2017 ప్రారంభంలో కర్నూలు నగరానికి నందినాటకాల పండుగ తరలి రావడంతో నాటకాభిమానులు గుండెల్లో ఆనందం ఉప్పొంగుతోంది.
టీజీవీ కళాక్షేత్రం వేదిక:
 స్థానిక సీ.క్యాంపు సెంటర్‌లోని టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల ప్రారంభోత్సవం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ నంది నాటకోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మెన్‌ చక్రపాణియాదవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ తదితర ప్రజాప్రతినిధులు అతిధులుగా హాజరవుతున్నారు. 
 
మొదటి రోజు:
ఉదయం 10.30 నిమిషాలకు బాపూజీ స్కౌట్‌ గ్రూపు వారి ‘ఆశాకిరణ్‌’ సాంఘిక నాటక, 12 గంటలకు మురళీ కళా నిలయం ఆరి అం అః..కం కః సాంఘిక నాటిక, మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య కళాభారతి వారి ‘అగ్నిపరీక్ష’ నాటిక సాయంత్రం 4.30 గంటలకు ప్రభు ఆర్ట్స్‌ వారి ‘ఐదో దిక్కు’ సాంఘిక నాటిక, సాయంత్రం 6 గంటలకు గణేష్‌ నికేతన్‌ వారి ‘బతికించండి’ సాంఘిక నాటిక ప్రదర్శించనున్నారని ఎఫ్‌డీఎస్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
 
15 రోజుల్లో 76 నాటక ప్రదర్శనలు:
నంది నాటకోత్సవాల్లో భాగంగా 25 పద్య నాటకాలు, 11 సాంఘిక నాటకాలు, 27 నాటికలు, 9 బాలల నాటికలు, 4 కళాశాల విద్యార్థులు, నాటికలు ప్రదర్శించనున్నారు. పద్యనాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు, బాలల నాటికలు, కళా విద్యార్థుల నాటికలకు రూ.15 వేల చొప్పున ప్రదర్శనా పారితోషకాన్ని ఆయా నాటక సమాజాలకు అందిస్తామని  శ్రీనివాసరావు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే ఈ నాటకోత్సవాలలో రాష్ట్ర వ్యాప్తంగా 1335 మంది సినీ, టీవీ, రంగస్థల నటీనటులు పాల్గొంటున్నారు. నంది నాటకోత్సవాలలో జరిగే నాటక ప్రదర్శనల్లో ప్రముఖ సినీ మాటల రచయిత (యమలీల ఫేం) దివాకర్‌బాబు, నటుడు కోట శంకర్రావు, టీవీ నటుడు మేకా రామకృష్ణ, సురభి ప్రభావతి తదితరులు పాల్గొననున్నారు. కర్నూలు లలిత కళా సమితి రూపొందించిన పద్యనాటకం ప్రమీలార్జన పరిణయం ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల వరకు జరిగే ఈ నంది నాటకోత్సవాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఎఫ్‌డీసీ అధికారులు తెలిపారు.   
 
మరిన్ని వార్తలు