ఓజోన్‌ పొర దెబ్బతినడంతోనే ప్రకృతి వైపరీత్యాలు

16 Sep, 2016 21:11 IST|Sakshi
ఓజోన్‌ పొర దెబ్బతినడంతోనే ప్రకృతి వైపరీత్యాలు
– జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరు రాజేంద్రారెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓజోన్‌ పొర దెబ్బతింటుండడంతోనే వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలు నెలకొంటున్నాయని పొల్యూషన్‌ బోర్డు కర్నూలు జోనల్‌ జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరు రాజేంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రపంచ ఓజోన్‌ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో మార్పులతో విపరీతమైన ఎండలు, వర్షాలు సక్రమంగా కురవకపోవడం, ప్రజలు రోగాలబారిన పడి చనిపోతుండడంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఓజోన్‌ పొరను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.  

ఓజోన్‌ పొర దెబ్బతినడానికి ప్రజలు వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణమన్నారు. వీటిని ప్రజలు మితంగా వాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. లేదంటే 50–60 ఏళ్ల మధ్య ఓజోన్‌ పొరకు పడిన చిల్లులు విస్తరించి అల్ట్రాసోనిక్‌ కిరణాలు నేరుగా భూమి పడే ప్రమాదం ఉందన్నారు. వాటితో ప్రజలకు చర్మక్యాన్సర్లు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెంది ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం ఓజోన్‌ పొరపై నిర్వహించిన వ్యాసరచన విద్యార్థులకు బహుమతులుగా మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో పొల్యూషన్‌ బోర్డు ఇంజినీరు ప్రసాదరావు, ప్రొఫెసర్లు మాధవరెడ్డి, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.   
మరిన్ని వార్తలు