విశ్వ విద్యాలయంలో నూతన కోర్సులు

23 Aug, 2016 19:39 IST|Sakshi
విశ్వ విద్యాలయంలో నూతన కోర్సులు

వైవీయూ :

యోగివేమన విశ్వవిద్యాలయంలో 2017–18 విద్యాసంవత్సరంలో నాలుగు నూతన కోర్సులు ప్రారంభిస్తున్నట్లు పాలకమండలి సభ్యులు ఎస్‌. గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైవీయూలో ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్, రెక్టార్, మరో పాలకమండలి సభ్యుడు ఏజీ దాముతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ప్రాంతంలో ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. వీరికి ఉపయోగపడేలా వైవీయూలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉర్దూ విభాగంతో పాటు ఫిషరీస్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ తదితర ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రొద్దుటూరు,రాజంపేట ప్రాంతాల్లో పీజీ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే విశ్వవిద్యాలయం నుంచి పంపివేయడమే గాక కఠినమైన చర్యలకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. ప్రిన్సిపాల్‌ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్‌ నిరోధించేందుకు అధ్యాపకులు తరగతి గదుల్లో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారన్నారు. కళాశాల ఆవరణంలో పోస్టర్‌లు, ఫ్లెక్సీలు, ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటుచేసి ప్రతిరోజూ అధ్యాపకులతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య గులాంతారీఖ్‌ మాట్లాడుతూ గతంలో డీఎస్పీ స్థాయి అధికారితో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించామన్నారు. త్వరలోనే మళ్లీ ఓసారి యాంటీర్యాగింగ్‌పై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పాలకమండలి సభ్యుడు, సీడీసీ డీన్‌ ఏజీ దాము మాట్లాడుతూ ర్యాగింగ్‌ అంశం దష్టికి రాగానే వసతిగహాల్లో ప్రతిబ్లాక్‌కు సెక్యూరిటీని ఏర్పాటుచేశామన్నారు. కొంతమంది విద్యార్థినులు ఒకబ్లాక్‌ నుంచి మరొక బ్లాక్‌ వెళ్లిన సమయంలో కొందరు అపార్థం చేసుకుని ర్యాగింగ్‌ కోసం వెళ్ళారని భావించారన్నారు. ఏదిఏమైనా ర్యాగింగ్‌కు ఎవరైనా పాల్పడితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ పాల్గొన్నారు.
 


 

మరిన్ని వార్తలు