నిర్మల్‌కు టీఎస్‌ 18

27 Oct, 2016 15:33 IST|Sakshi
నిర్మల్‌కు టీఎస్‌ 18

♦ నిర్మల్‌కు కొత్త వాహన రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ ప్రారంభించాం
♦ మధ్యవర్తుల ప్రమేయంలేకుండా కార్యాలయంలో సేవలు
♦ ప్రమాదరహిత జిల్లాను చేస్తాం
♦ చించోలి రోడ్డులో ఐదెకరాల్లో ఆర్టీఏ శాశ్వత భవనం, డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణం
♦ ప్రజలకు అసౌకర్యం కలిగితే 9948788443నంబర్‌ను సంప్రదించాలి ∙జిల్లా రవాణాధికారి కె.వెంకటరమణ


కొత్త జిల్లా నిర్మల్‌కు ట్రాన్‌పోర్ట్, నాన్‌ట్రాన్‌పోర్ట్‌ వాహన రిజిస్ట్రేషన్‌ పరంగా కొత్త సిరీస్‌ టీఎస్‌ 18ను జిల్లా ఆవిర్భావమైన దసరా రోజు నుంచి ప్రారంభించినట్లు నిర్మల్‌ జిల్లా రవాణాధికారి కె.వెంకటరమణ తెలిపారు. ఇకపై నిర్మల్‌ జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్‌లన్నీ టీఎస్‌ 18తోనే జరుగుతాయని వివరించారు. ఈ రెండంకెలు కలిపితే 9 రావడం అదృష్టమని, రిజిస్ట్రేషన్‌ల సంఖ్య, రవాణాశాఖకు ఆదాయం కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. దసరా నుంచి ఇప్పటివరకు ట్రాన్‌పోర్ట్‌ పరంగా 60, నాన్‌ ట్రాన్‌పోర్ట్‌ పరంగా 300వరకు కొత్త సిరీస్‌పై రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు ఇదివరకున్న టీఎస్‌ 1 సిరీస్‌ యథావిధిగా కొనసాగుతుందని, మంచిర్యాల జిల్లాకు టీఎస్‌ 19, ఆసిఫాబాద్‌కు టీఎస్‌ 20 సిరీస్‌ ప్రభుత్వం కేటాయించిందన్నారు. నిర్మల్‌ జిల్లా రవాణా ధికారి (డీటీవో) కె.వెంకటరమణ అటు ఆదిలాబాద్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా కూడా కొనసాగుతున్నారు. ఆయనను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది.  – సాక్షి, నిర్మల్‌                     

సాక్షి : కొత్త జిల్లా ఏర్పాటుతో శాఖాపరంగా వచ్చిన మార్పులేవి?
డీటీవో : కొత్త జిల్లా ఏర్పడడంతో జిల్లాకు జిల్లా రవాణాధికారి (డీటీవో)లను నియమించారు. ఆర్టీవోగా, డీటీవోగా సంబోధించవచ్చు. పాత జిల్లాల్లో జిల్లా రవాణాధికారే అయినప్పటికీ హోదాను డిప్యూటీ కమిషనర్‌గా సంబోధిస్తారు. నిర్మల్‌ జిల్లాలో రాష్ట్రస్థాయి అధికారి ఆర్టీవో నియామకంతోపాటు క్షేత్రస్థాయిలో వాహన తనిఖీ అధికారులు, ఆర్టీవో కార్యాలయ పరిపాలన అధికారి(ఏవో), సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆఫీస్‌ సబార్డినేట్లను నియమించారు. ప్రస్తుతం నేను నిర్మల్‌ జిల్లా రవాణాధికారిగా, ఆదిలాబాద్‌ జిల్లాడిప్యూటీ కమిషనర్‌గా రెండు స్థానాల్లో ఉన్నాను.

సాక్షి : జిల్లా కేంద్రమైన నేపథ్యంలో నిర్మల్‌లో డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మించే ఆలోచన ఉందా?
డీటీవో : ఇప్పటివరకు రవాణాశాఖ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రభుత్వం సారంగాపూర్‌ మండలం చించోలి రోడ్డులో అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద ఐదెకరాల స్థలం కేటాయించింది. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వపరంగా, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో శాశ్వత భవనం, డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మించి ఆర్టీవో కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తాం.
సాక్షి : ఆర్టీఏ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పనులు జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.. దీనిపై ఏమంటారు?
డీటీవో : రవాణా శాఖలో పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ చేయడం జరిగింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా కంప్యూటరీకరణ చేశాం. వెబ్‌సైట్‌ www.transport.telangana.gov.in లో లాగిన్‌ అయి రవాణా శాఖలో ఏ రకమైన స్లాట్‌ను బుక్‌ చేసుకునేందుకు వీలుంది.. ఆన్‌లైన్, ఈ సేవలో చార్జీలు చెల్లించి కార్యాలయానికి వచ్చి పని పూర్తి చేసుకోవాలి. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్టీవో కార్యాలయంలో పనులు చేసుకోవచ్చు. ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే 9948788445 నంబర్‌లో నన్ను సంప్రదించాలి.

సాక్షి : రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీటీవో : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు సేఫ్టీ కమిటీ ప్రతీ జిల్లాలోనూ పనిచేస్తోంది. కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎస్పీ వైస్‌ చైర్మన్‌గా, మెంబర్‌ సెక్రెటరీగా ఆర్టీవో కొనసాగుతారు. ప్రతీ నెల ఒక సమావేశం నిర్వహిస్తారు. ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల అధికారులు ఆ సమావేశంలో పాల్గొని ప్రమాదాల నివారణపై చర్చిస్తారు. జిల్లాలో ప్రమాదాలు జరుగు స్థలాలను ఇదివరకు గుర్తించాం. భైంసా–నిర్మల్‌ దారిలో అధికంగా జరిగేవి. ప్రస్తుతం డబుల్‌ రోడ్డు కావడంతో ప్రమాదాలు తగ్గాయి. అలాగే రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాలో పూర్తిగా ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేస్తాం.

సాక్షి : స్కూల్‌ బస్సులు సరైన ఫిట్‌నెస్‌ లేకుండానే రోడ్డుపై ప్రమాదకరంగా తిరుగుతున్నాయనే ఆరోపణలపై మీరేమంటారు?
డీటీవో : స్కూల్, కళాశాల యజమాన్యాలు తమ బస్సులకు సంబంధించిన జీవో 35 ప్రకారం నడుచుకోవాలి. డ్రైవర్, బస్‌ కండిషన్‌ విషయంలో యాజమాన్యం, పేరెంట్స్‌ కమిటీ తనిఖీ చేస్తూ ఏవైనా సందేహాలుంటే రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలి. ఫిట్‌నెస్‌ పాటించని పక్షంలో సదరు బస్సులను సీజ్‌ చేయడమే కాకుండా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం.
సాక్షి : ప్రజలకు మీరు ఇచ్చే సందేశం.
డీటీవో : రోడ్డు భద్రత విషయంలో ప్రజలను కోరేది ఒక్కటే. ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు మృతి చెందుతున్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. కార్లల్లో సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, మత్తు పానీయాలు తీసుకుని డ్రైవింగ్‌ చేయరాదు. చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ప్రజలు రవాణాశాఖ ద్వారా మెరుగైన సేవలు పొందుతూ రోడ్డు భద్రతవిషయాలను పాటించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు