నేడు ఉత్తర తెలంగాణ ఆర్యవైశ్య సమ్మేళనం

10 Aug, 2016 23:34 IST|Sakshi
నేడు ఉత్తర తెలంగాణ ఆర్యవైశ్య సమ్మేళనం
  • హాజరుకానున్న తమిళనాడు గవర్నర్‌ రోశయ్య 
  • గోదావరిఖని : ఉత్తర తెలంగాణ జిల్లాల ఆర్యవైశ్యుల ప్రాంతీయ సదస్సు గోదావరిఖనిలో బుధవారం జరుగనుంది. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 10 గంటలకు రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆయనకు ఆర్యవైశ్య ప్రముఖులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం ఎన్టీపీసీ వీఐపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 11.30 గంటల సమయంలో రామగుండం ఎరువుల కర్మాగారం పరిధిలోని పాత ఎస్‌బీహెచ్‌ బ్యాంకు సమీపంలో హరితహారంలో భాగంగా మొక్కను నాటుతారు. అక్కడి నుంచి గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మహాత్మాగాంధీ విగ్రహం, అడ్డగుంటపల్లి తీన్‌రస్తాలో రామగుండం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని రోశయ్య ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సింగరేణి ఆర్జీ–1 కమ్యూనిటీహాల్‌లో జరగనున్న ఆర్యవైశ్య మహాసభ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో పాల్గొని ఆర్యవైశ్యులనుద్దేశించి మాట్లాడుతారు. రోశయ్యతోపాటు పలువురు మంత్రులు, ఆర్టీసీ చైర్మన్, నగర మేయర్, ఇతర వైశ్య ప్రముఖులు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. గోదావరిఖనిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న సదస్సుకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి సుమారు ఐదు వేల మంది వరకు ఆర్యవైశ్యులు హాజరవుతారని సదస్సు కన్వీనర్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. ఆర్యవైశ్యులకు ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని, నిరుపేదలైన ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని ఈ సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు.  
    ======================================
    రోశయ్య పర్యటనకు భారీ బందోబస్తు
    – ఇన్‌చార్జిగా జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌
     
    కోల్‌సిటీ : గోదావరిఖనిలో తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య గురువారం పర్యటించనుండడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్‌ పుష్కరాల బందోబస్తులో ఉన్నారు. దీంతో జగిత్యాల డీఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ గోదావరిఖని ఇన్‌చార్జి డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు. గోదావరిఖని, రామగుండం, ఎఫ్‌సీఐ, ఎన్టీసీపీలో డీఎస్పీ  బుధవారం పర్యటించారు. బందోబస్తును పరిశీలించారు. ఎఫ్‌సీఐ, అడ్డగుంటపల్లిలోని అబ్దుల్‌కలాం విగ్రహం ఆవిష్కరణ ప్రాంతం, ఆర్యవైశ్య భవన్, సింగరేణి కమ్యూనిటీ హాల్, రామగుండం రైల్వే స్టేషన్, ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌ను రామగుండం సీఐ వాసుదేవరావు, టూటౌన్‌ సీఐ దేవారెడ్డితో కలిసి డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. ప్రయోగాత్మక కాన్వాయ్‌ని డీఎస్పీ స్వయంగా ప్రారంభించి పోలీసుల అప్రమత్తతను పరిశీలించారు. అతనంతరం బందోస్తు  ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. నలుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 160 మంది పోలీసులు రెండు మొబైల్‌పార్టీలు, రూఫ్‌పార్టీ, కాన్వాయ్‌ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారని తెలిపారు.  మార్కండేయకాలనీలోని ఆర్యవైశ్య సమ్మేళన కమిటీ కన్వీనర్‌ కోలేటి దామోదర్‌ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారని తెలిపారు.  
     
     
మరిన్ని వార్తలు