అసంతృప్తులకు నామినేటెడ్‌ తాయిలం

4 Apr, 2017 23:18 IST|Sakshi
అసంతృప్తులకు నామినేటెడ్‌ తాయిలం

- ఆదాల, కోటంరెడ్డికి కార్పొరేషన్‌ పదవులు
- జెడ్‌ఎస్‌కు నుడా చైర్మన్‌
- ఆర్నెల్ల కిందట తయారు చేసిన జాబితా ఆధారంగా కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు
- నెలాఖరులోపు పదవుల పందేరం ఉండొచ్చంటున్న పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు


సాక్షి ప్రతినిధి – నెల్లూరు : మంత్రి మండలి పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జిల్లాలో ప్రారంభమైన అసంతృప్తులను కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ హై కమాండ్‌ పదవు ల పందేరానికి రంగం సిద్ధం చేసింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నె ల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కార్పొరేషన్‌ చైర్మ న్, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ జెడ్‌ శివప్రసాద్‌కు నుడా చైర్మన్‌ పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది.

ఆదాలకు ఆర్టీసీ చైర్మన్‌
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌  నుంచి టీడీపీలోకి వచ్చిన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించారు. ఎన్నికల్లో ఓడినా రాజ్యసభ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఈ విషయం గురించి పట్టించుకోలేదు. స్థానిక సంస్థల కోటా లేదా ఎమ్మెల్యేల కోటాలో తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ఆదాల గట్టిగా అడిగారు. ఇది కుదరక పోవడంతో కీలకమైన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం, తనకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు పట్టించుకోక పోవడంతో ఆదాల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అయితే తన అసంతృప్తిని ఎక్కడా బహిరంగ పరచకుండా నేరుగా అధిష్టానానికే సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాలకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. సాంకేతిక అంశాలు ఇబ్బందిగా మారక పోతే ఆర్టీసీ చైర్మన్‌ లభించే అవకాశం ఉందని పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. అలా కాని పక్షంలో ఇంకేదైనా కీలక మైన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

కోటంరెడ్డికి కార్పొరేషన్‌
ఎంతో కాలంగా  పార్టీనే నమ్ముకుని ఉన్న నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 2014 ఎన్నికల సమయంలో సిటీ శాసనసభ స్థానం టికెట్‌ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. అప్పట్లో సినీనటుడు బాలకృష్ణ కూడా గట్టిగా సిఫారసు చేశారు. చివరి నిమిషంలో ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డికి టికెట్‌ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తన గురించి పట్టించుకోవడం లేదని కోటంరెడ్డి పార్టీ పెద్దల వద్ద తన ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

నెల్లూరులో పార్టీ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆనం సోదరుల ఆధిపత్యాన్ని ఎదుర్కుని కార్యక్రమాలు నిర్వహించిన విషయం పార్టీ గుర్తించడం లేదని ఆయన మనసులోనే ఆం దోళన చెందుతున్నారు. నామినేటెడ్‌ పదవుల పంపకాల కోసం ఆర్నెల్ల కిందట జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తయారు చేసిన జాబితాలో కోటంరెడ్డి కూడా ఉన్నారు. ఇక ఎన్నికల వాతావరణం ప్రారంభమైనందువల్ల కోటంరెడ్డికి  ఏదో ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని పార్టీ హై కమాండ్‌ నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

జెడ్‌ఎస్‌కు నుడా
2014లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి మేయర్‌ అభ్యర్థి కరువయ్యారు. ఆ సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రోర్బలంతో డాక్టర్‌ జెడ్‌.శివప్రసాద్‌ రంగంలోకి దిగారు. ఎన్నికల నిర్వహణ వ్యయమంతా ఆయనే భరించారు. కార్పొరేషన్‌లో టీడీపీ అధికారంలోకి రాలేక పోయింది. జెడ్‌ఎస్‌ను పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా నియమించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు తగిన గుర్తింపు కలిగిన పదవి ఇప్పించాలని సోమిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు పట్ట ణాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటు తథ్యం కావడంతో జెడ్‌ఎస్‌ ఈ పదవి ఆశిస్తున్నారు. ఒకటి, రెండు నెలల్లో నుడాకు పాలక వర్గం నియామకానికి అధి కారిక ప్రక్రియ సాగుతోంది.

జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే అనేక పదవులు ఇ చ్చారు.మరో బలమైన సామాజిక వర్గమైన యాద వ కులానికి ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చా రు. ఆ తర్వాత గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉన్న చేనేత సామాజిక వర్గం తమకు గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకుని పోయింది. ఈ సామాజిక వర్గానికి చెందిన జెడ్‌ఎస్‌ను నుడా చైర్మన్‌గా నియమించడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా నిర్ణయించి నట్లు తెలిసింది. తన రాజకీయ గురువు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కడంతో జెడ్‌ఎస్‌కు పదవి రావడానికి అవకాశాలు మరింత బలపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు