సీఎం వస్తే.. జేబుకు చిల్లే!

6 Sep, 2017 08:05 IST|Sakshi
సీఎం వస్తే.. జేబుకు చిల్లే!

ఆందోళన చెందుతున్న అధికారులు
అనంతపురం అర్బన్‌: ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారంటే... అధికారులు హడలిపోతున్నారు. ఏర్పాట్లపేరుతో ఇప్పటికే భారీగా ముట్టజెప్పుకున్న అధికారులు...ఇపుడు మళ్లీ సీఎం వస్తున్నారనగానే జేబులు తడుముకుంటున్నారు. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసిన అధికారులు...ఆ బిల్లులు రాక.. అరువు తెచ్చిన చోట మాటపోతోందని ఆవేదన చెందుతున్నారు. రూ.లక్ష  లేక రూ.2 లక్షలో కాదు ఏకంగా రూ.కోటిన్నరకు పెగా బిల్లులు బకాయి ఉండడంతో వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక... పరిస్థితి కలెక్టర్‌కి చెప్పుకునే ధైర్యం చాలక మనోవేదనకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ సంస్థకు ఏకంగా రూ.7.56 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిసింది.

మోయలేని భారం
ఈ ఏడాది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నాలుగు సార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. ఐదవసారిగా ఈనెల 8న జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సభలకు తరలించే ప్రజలకు భోజన వసతి గతంలో ఉండేది కాదు. కానీ రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన ‘ఏరువాక’ కార్యక్రమానికి దాదాపు 200 బస్సుల్లో ప్రజలను తరలించారు. వీరందరికీ అధికారులు భోజన వసతి కల్పించారు. పర్యటనకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి రెండు, మూడు కార్యక్రమాలతో పాటు, బహిరంగసభలోనూ పాల్గొంటారు.

ఇందుకు వేదిక, పూల అలంకరణ, మైక్‌ సిస్టం, బారికేడ్లు ఏర్పాటు, కుర్చీలు, షామియానాలు, ఇలా పలు రకాల ఏర్పాట్ల బాధ్యత అధికారులదే. వీటనింటికి తమ పరపతి మీద అరువు పెట్టి పూర్తి చేస్తునామనీ, సీఎం పర్యటన తర్వాతైనా బిల్లులు మంజూరు చేస్తున్నారా... అంటే అదీ లేదని అధికారవర్గాలు వాపోతున్నాయి. చివరికి రూ.50 వేలు బిల్లు కూడా మంజూరు కావడం లేదని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం పర్యటన అంటే భయపడాల్సి వస్తోందంటున్నారు.

మరిన్ని వార్తలు