ఓఎస్డీ అభీష్టను తప్పించారు..

29 Dec, 2015 08:07 IST|Sakshi
ఓఎస్డీ అభీష్టను తప్పించారు..

     ► లోకేశ్‌పై ఆరోపణల నేపథ్యం
     ► ఆయన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లకుండా
     ► ఏపీ సీఎం ముందుజాగ్రత్త

సాక్షి, హైదరాబాద్: తన కార్యాలయంలో ఓఎస్డీగా పని చేస్తున్న సీతేపల్లి అభీష్టను ఏపీ సీఎం చంద్రబాబు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అభీష్ట రాజీనామాకు ఆమోదం తెలిపారు. సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు చేసింది. చినబాబు లోకేశ్‌పై ఆరోపణలు నానాటికీ తీవ్రమవుతుండటం, ఇలాగే కొనసాగితే కుమారుడి రాజకీయ జీవితానికి భవిష్యత్తులో ఇబ్బంది తప్పదనే భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి లోకేశ్ సహధ్యాయి అయిన అభీష్టను మొదటి నుంచి ప్రోత్సహించింది  బాబే. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించేలా చేసేందుకు అభీష్టను పావులా వాడుకున్నారనే విమర్శలున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అభీష్ట కూడా ఆయన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.

అప్పటినుంచి ఆయనద్వారానే తండ్రీకొడుకులు అన్ని వ్యవహారాలు నడిపించారనే ఆరోపణలున్నాయి ముఖ్యంగా చినబాబు లోకేశ్ తరఫున సీఎం కార్యాలయంలో కార్యకలాపాలను అభీష్ట చక్కబెడుతుండేవారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు, ఐటీ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు దగ్గర నుంచి ప్రభుత్వంలో ఏ చిన్నపని అయినా లోకేశ్ మాట మేరకు అభీష్ట నెరవేరుస్తూ వచ్చారు. సీనియర్ అధికారులు కూడా లోకేశ్‌కు సన్నిహితుడైన అభీష్ట కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూసేవారు. అభీష్ట మాట వినని పలువురు అధికారులు కీలకమైన శాఖల నుంచి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి తెరవెనుక మంత్రాంగం అంతా ఆయనే నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఇటీవలి మరింత తీవ్రమై సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం ఊపందుకుంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే సూచనలు కన్పిస్తుండటంతో బాబు అభీష్టను తప్పించారు. అయితే అభీష్ట... బాబు, లోకేశ్‌లు చెప్పినట్లు వ్యవహరించారే తప్ప తనంతట తానుగా వ్యవహారాలు నడపలేదని సీఎంఓ వర్గాలంటున్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను సమన్వయం చేసుకోలేకపోతున్నందుకే ఓఎస్డీ బాధ్యతల నుంచి అభీష్ట తప్పుకున్నారని, భవిష్యత్తులో పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాబు తనను తప్పించాలని నిర్ణయం తీసుకోవడంతో అభీష్ట గత నవంబర్ 30నే రాజీనామా లేఖను సీఎం కార్యాలయానికి పంపించారని సమాచారం.

మరిన్ని వార్తలు