ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన: పి.మధు

30 Jan, 2016 21:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో దౌర్జన్యకర దుర్మార్గపు పాలన సాగుతోందని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించి ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ర్టప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యపోరాటాలతో ఎదుర్కొంటామని హెచ్చరించారు. రెండు రోజులపాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల తీర్మానాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. బాక్సైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలపై హత్య కేసు బనాయించడం దారుణమన్నారు. విశాఖ ఏజన్సీలో మావోయిస్టులు చేసిన హత్యను ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణులను రోజుల తరబడి పోలీసులు చిత్రవద చేసి భయానక పరిస్థితి కల్పించారని ఆరోపించారు.
బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ మత దురహంకారంతో మేధావుల హత్యలు, మైనారిటీలపై దాడులు. రోహిత్ ఆత్మహత్యపైన కనీసం స్పదించడంలేదని తప్పుబట్టారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఫిబ్రవరి 20 నుంచి వామపక్షాల బస్సుయాత్ర చేపడతామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం, పేదలకు ఇళ్ల స్థలాలు, రైతుల భూములకు భరోసా, ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మార్చి 10న చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. 45 మండలాలకు మంచినీరు అందించే కండలేరు ప్రాజెక్టు రద్దుకు నిరసనగా జనవరి 31న జరిగే ప్రత్యక్ష ఆందోళనలోను, భోగాపురంలో బలవంతపు భూసేకరణకు నిరసనగా ఫిబ్రవరి 4న జరిగే కార్యక్రమంలోను పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొంటారన్నారు.

రాజధాని, ఎయిర్‌పోర్టులు, ప్రోజెక్టుల పేరుతో రైతాంగం నుంచి చట్టవిరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకోవడంపై అన్ని జిల్లాల్లోనూ పోరాట కార్యక్రమాలు చేపడతామన్నారు. వంశధార, పులిచింతల రిజర్వాయర్‌లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు న్యాయం చేయకుండా వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సింగపూర్ కన్సార్టీయం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు రాజధాని పనులు అప్పగించే ఏకపక్ష నిర్ణయాలు భవిష్యత్‌లో ఇబ్బందికరంగా పరిణమిస్తాయన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలను కాదని జన్మభూమి కమిటీలకు అప్పగించడం దారుణమని, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంపన్నవర్గాలు, కార్పొరేట్లకు భూ పందేరంతో సహా అనేక రాయితీలిస్తున్న ప్రభుత్వం చిరుద్యోగులు, రైతులు, పేదలు పట్ల కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పాటూరి రామయ్య, వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు