శేషాచలంలో పోలీసులపై ‘ఎర్ర’ కూలీల దాడి | Sakshi
Sakshi News home page

శేషాచలంలో పోలీసులపై ‘ఎర్ర’ కూలీల దాడి

Published Sat, Jan 30 2016 9:58 PM

Red scanders attacks with stones on police

* తుంబురుతీర్థం మార్గంలో ఎనిమిది మంది కూలీల లొంగుబాటు
* రూ.30 లక్షల విలువైన 20 దుంగల స్వాధీనం

సాక్షి, తిరుమల : తిరుమల శేషాచలంలో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో ఎర్ర కూలీలు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా కొందరు లొంగిపోగా మరికొందరు పరారయ్యారు. తుంబురు తీర్థం మార్గంలో.. తిరుమలలోని పాపవినాశం డ్యామ్ నుంచి ఉత్తరదిశలోని తుంబురు తీర్థం మార్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో శనివారం టూటౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన కూలీలు వారిపై రాళ్ల దాడికి దిగారు. ఎస్‌ఐ వెంకట్రమణ తన పిస్తోల్‌ను బయటకు తీయడంతో ఎనిమిది మంది కూలీలు లొంగిపోయారు. వారి నుంచి 300కిలోల బరువుగల 9 మేలిమి రకానికి చెందిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని సీఐ రామలింగం తెలిపారు. లొంగిపోయిన వారిలో తమిళనాడుకు చెందిన సుందర్ (18), చంద్రశేఖర్ (18), తిరుపతి (18), దొరై (28), తంగరాజు (30), అశోక్ (28), కుమార్(28), శంకర్ (30) ఉన్నారు.

కేపీ డ్యామ్.. మామిళ్లమంద ప్రాంతంలో..
తిరుమలలోని కేపీ డ్యామ్, మామిళ్ల మంద ప్రాంతంలో టాస్క్‌ఫోర్సు, అటవీశాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తీసుకెళుతున్న కూలీలను గమనించారు. వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్సు సిబ్బంది ప్రయత్నించగా రాళ్లు, ఆయుధాలతో దాడికి ప్రయత్నించి అడవిలోకి పారిపోయారు. కూలీలు వాడిన ఆయుధాలు, రూ.10 లక్షల విలువ కలిగిన 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్సు ఆర్‌ఎస్‌ఐ లక్ష్మణ్, డీఆర్‌వో వెంకటస్వామి తెలిపారు.

Advertisement
Advertisement